Indian Team Record: టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 23 నుండి మాంచెస్టర్ వేదికగా 4 వ టెస్ట్ మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల ఈ సిరీస్ లో ఇప్పటివరకు 2-1 తో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. ఈ నాలుగోవ టెస్ట్ ఇరుజట్లకు కీలకం. భారత్ కి ఈ మ్యాచ్ లో గెలుపు అవసరం కాగా.. ఇంగ్లాండ్ కి కూడా ఈ సిరీస్ గెలవాలంటే మాంచెస్టర్ లో పరుగుల వరద పారించాల్సిందే.
ఈ నేపథ్యంలో ఇరుజట్లు శక్తి కొద్ది గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా డ్రా కాకుండా ఎవరో ఒకరు గెలుస్తూ ఉండడంతో.. నాలుగవ మ్యాచ్ కూడా గెలుపు తధ్యమని ఇరుజట్లు నమ్మకంగా ఉన్నాయి. ఒకవేళ నాలుగో టెస్ట్ డ్రా తో ముగిసినా.. ఐదవ టెస్ట్ కూడా ఇరుజట్లకు కీలకంగా మారబోతోంది. ఇక ప్రస్తుతం ఎటు చూసినా మాంచెస్టర్ లో జరిగే మ్యాచ్ మాత్రం ఉత్కంఠను రేపుతోంది.
ఈ సిరీస్ లో ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా కచ్చితంగా ఈ నాలుగో టెస్ట్ లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మాంచెస్టర్ లో భారత జట్టు గత రికార్డులు ఏమంత గొప్పగా లేవు. ముందుగా టెస్ట్ క్రికెట్ లో భారత్ – ఇంగ్లాండ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు మొత్తం 139 టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ 53 మ్యాచ్ లు గెలుపొందింది. ఇక భారత జట్టు 36 సార్లు విజయం సాధించింది. మరో 50 టెస్ట్ మ్యాచ్లు డ్రా గా ముగిశాయి.
మాంచెస్టర్ లో భారత్ కి ఓటమేనా..?
మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం గురించి మాట్లాడుకుంటే.. ఈ మైదానంలో భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్లు గెలుపొందింది. మిగిలిన 5 మ్యాచ్లు డ్రా గా ముగిశాయి. ఈ మైదానంలో భారత జట్టు చరిత్రలో ఎప్పుడు గెలవలేదు. 1974లో ఈ వేదికపై భారత్ విజయానికి దగ్గరగా వచ్చింది. కానీ ఇంగ్లాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మైదానంలో చివరిసారిగా 2014లో భారత్ – ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఒక ఇన్నింగ్స్ లో 367 పరుగులు చేసింది.
ఇక భారత జట్టు రెండు ఇన్నింగ్స్ లలో కలిపి మొత్తం 367 పరుగులు చేయలేక పోయింది. చివరికి భారత జట్టు ఆ మ్యాచ్ లో 54 పరుగులు తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లు చాలామంది ఈ మైదానంలో ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. టీమిండియా తరఫున ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సునీల్ గవాస్కర్.
Also Read: Virat Kohli Autograph: కోహ్లీ ఆటోగ్రాఫ్… రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన 10 ఏళ్ల కుర్రాడు..?
అతడు ఐదు ఇన్నింగ్స్ లలో ఈ మైదానంలో 242 పరుగులు చేశాడు. 21 శతాబ్దంలో అరంగేట్రం చేసిన ఏ భారత బ్యాట్స్మెన్ కూడా ఈ వేదికపై టెస్ట్ మ్యాచ్ లలో 200 పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు. ఇక ఈ నాలుగో మ్యాచ్ కి భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేయని ఆటగాళ్లను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో కరుణ్ నాయర్ ఒకరు. అలాగే బౌలింగ్ లో కూడా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.