
Lord Shiva : మధ్యప్రదేశ్‌లోని ఖజురహో.. భారతీయ శృంగార శిల్పనగరిగా చరిత్రలో గుర్తింపుపొందింది. అక్కడి శిల్పాల్లో అణువణువనా ప్రణయ భావననలను ప్రేరేపేంచే ఆ ఆలయ సమూహం మధ్యలో ఆధ్యాత్మికత వెల్లివెరిసే ఒక మందిరమూ ఉంది. అదే మాతంగేశ్వర ఆలయం. పరమశివుడు ప్రణయమూర్తిగా కొలువైన అరుదైన ఆలయం ఇది. ఖజురహోలోని దేవాలయాల్నింటిలో నేటికీ పూజలు జరుగుతున్న ఏకైక పురాతన ఆలయం ఇదొక్కటే. వాస్తవానికి 1100 ఏళ్ల నాటి ఖజురహోలో మొత్తం 85 ఆలయాలుండగా, వాటిలో 20 ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే.. అనాది నుంచి నేటివరకు నిత్యం పూజలందుకుంటున్న దేవాలయం మాత్రం మాతంగేశ్వరుడిదే.
ఈ ఆలయంలోని మాతంగేశ్వర సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుంది. నేల పైభాగంలో ఎంత ఎత్తు ఉందో, భూమిలో కూడా అంతే లోతులో ఈ విగ్రహం విస్తరించి ఉంటుంది. ఇక్కడి మాతంగేశ్వరుడి శివలింగాన్ని ‘సజీవ లింగం’గా ఆరాధిస్తారు. ఏటా కార్తీక పున్నమి రోజున ఈ శివలింగం ఎత్తు ఒక అంగుళం పెరుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఆ ఆ రోజున ఈ లింగం ఎత్తును కొలుస్తారు. శివ భక్తుడైన చందేల వంశ పాలకుడు చంద్ర దేవ్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
మహాభారత కాలంలో ధర్మరాజు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు.. ఆయనకు మహిమాన్వితమైన మరకతమణిని ప్రసాదించాడు. ఈ మణి.. ధర్మరాజు నుంచి మాతంగ మహర్షికీ, ఆయన నుంచి హర్షవర్ధనుడనే రాజుకూ ఈ మణి సంక్రమించింది. ఎప్పుడూ యుద్ధాలతో తీరిక లేని హర్షవర్ధనుడికి ఆ మణిని భద్రపరుచుకోవడం కష్టమై, దానిని భూమిలో పాతి పెట్టాడు. కాలక్రమేణా ఆ మణి చుట్టూ ఒక శివలింగం లాంటి ఆకారం ఏర్పడింది. అదే నేటి మాతంగేశ్వర లింగంగా మారింది.
మరో గాథ ప్రకారం.. మాతంగ మహర్షి సాక్షాత్తూ శివుడి పదవ అవతారం. ఆయన వారణాసి, గయ, కేదార్‌నాథ్‌లతో బాటు నాలుగో ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, నాలుగు చోట్లా నాలుగు శివాలయాలు నిర్మించాడు. ఈ నాలుగు ఆలయాల్లో కొలువుదీరిన పరమేశ్వరుడిని మాతంగేశ్వరుడు అనే పిలుస్తారు. అయితే.. ఖజురహోలోని మాతంగేశ్వరుణ్ణి ‘మృత్యుంజయ మహాదేవుడ’ని అనటం విశేషం.
పార్వతీ పరమేశ్వరుల వివాహ వేదిక ఖజురహోయేనని, ఆదిదంపతుల ప్రణయ విహారం చేసిన భూమి కాబట్టే ఇది శృంగార శిల్పకళకు కేంద్రం అయిందని, కనుకనే ఇక్కడ పరమేశ్వరుడిని ‘ప్రణయమూర్తి’గా ఆరాధిస్తారని చెబుతారు. ఇక్కడి లింగాన్ని తాకి, ప్రార్థిస్తే.. నెరవేరని కోరిక ఉండదని భక్తుల నమ్మకం.