Fee Reimbursement Scheme: తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచినట్లు తెలిపారు.
తమ డిమాండ్లను పరిష్కరించేవరకు బంద్ కొనసాగిస్తామని రమేష్ బాబు స్పష్టం చేశారు. జేఎన్టీయూ, ఉస్మానియా పరిధిలో నిర్వహిస్తున్న పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు బహిష్కరించాయని తెలిపారు. కళాశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేనను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తమను ఎంత వేధిస్తున్నా భరిస్తున్నామని అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 8న 70 వేల ప్రైవేట్ అధ్యాపకులతో భారీ సభ నిర్వహిస్తామని తెలిపారు.
ఫీజు రియింబర్స్‌మెంట్ సమస్యల పరిష్కారినికి వేసిన కమిటీని అహ్వానిస్తున్నామని, అయితే మూడు నెలలు కాకుండా నెల రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు. మర్చి నాటికి బకాయిలు చెల్లించాలని రమేష్ బాబు కోరారు. కాలేజీలపై విజిలెన్స్ దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.
దీపావళి నాటికి రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు కేవలం రూ. 360 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వారు మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు రూ. 10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలను బంద్ చేసి యజామాన్యాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.