
Lakshmi Puja : దీపావళి అంటే దీపాల వరుస. ఆ రోజున ఇల్లు దీపాలతో వెలిగిపోవాలి. ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఉపయోగంలో లేని అన్ని విరిగిన వస్తువులను బయట పడేయాలి. ముఖ్యంగా ఇంటికి ఉత్తరంగా ఉండే కుబేర స్థానాన్ని శుద్ది చేసుకోవాలి. ఇంటికి ఉత్తరం, ఈశాన్య దిశలను చక్కగా, శుభ్రంగా, ఆకర్షణీయంగా, అందంగా ఉండేటట్టు చూసుకోవాలి.
ఇంటి ఉత్తర దిశలో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉండేలా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈదిశలో బరువు పెట్టకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.. ఈ ప్రాంతంలో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉంటే ఆదాయాన్ని కోల్పోతారు. ఉత్తరాన నీటి ట్యాంక్ లేదా సంపు, బోరు లాంటివి మాత్రమే ఉండాలి.
అమావాస్య, పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ఆరాధన మంచిది. ఈ రెండు తిథుల్లో శక్తిఆరాధన మంచిది. అమావాస్యనాడు పూర్ణ తిథి ఉంటుంది కనుక ఆరోజు లక్ష్మీదేవీ పూజ మంచిదని దేవీభాగవతంలోను చెప్పారు. లక్ష్మీ దేవి అనేక రూపాల్లో ఉన్న ధనలక్ష్మి రూపాన్ని దీపావళి నాడు ఆరాధించడం కలిసొస్తుంది.లక్ష్మిదేవిని పూజించడం వల్ల జ్ఞానం, ఆనందం రెండూ సిద్ధిస్తాయి.
దీపావళి రోజున ఇంటిని మెరిసే లైట్లు, పువ్వులు, ముగ్గులతో అలంకరించుకోవాలి. సువాసన వచ్చే అగరబత్తీలు వెలిగించి, సాంబ్రాణితో దూపం వేయాలి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇలా చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
ముఖ్యంగా దీపావళికి వ్యాపారులు ఎంతో భక్తితో లక్ష్మీ దేవిని పూజిస్తారు.ఆభరణాలు, డబ్బులు వంటివి లక్ష్మీదేవి ముందు పెడితే మంచిది. పూజ గదిలో దీపాలని పెట్టడం లేదా లైట్లని పెట్టడం లాంటివి చేయాలి. ఇల్లంతా కూడా దీపాలతో అలంకరిస్తే ఇంకా మంచిది. దీపాలు వెలిగించే టప్పుడు పూజ గదిలో దీపాన్ని పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది గుండ్రంగా ఉండే దీపాలను మాత్రమే వెలిగించాలని అంటారు కానీ పొడుగ్గా ఉండే దీపాలను వెలిగించవచ్చు.
టపాసులు పేల్చాల్సిందేనా!
మొదట్నుంచి మనది వ్యవసాయ ఆధారిత దేశమే. చాలా ప్రాంతాల్లో ప్రధాన ఆహారం…శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. కీటకాలతో పంట దిగుబడి తగ్గుతుంది. ప్రజలకి కూడా కీటకాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు గంధకం వాడకం మంచి పరిష్కారం. దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుందని నమ్మకం..అందుకే టపాసులు కాల్చాలని మన పెద్దలు చెప్పే వారు.