Amaravati News: ఏపీలో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్నాయా? ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? లేకుంటే వేటు ఎదుర్కొంటారా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలతో ఆ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైందా? స్పీకర్ వ్యాఖ్యలు వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈసారి అసెంబ్లీకి రాకుండే వేటు ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమా?
వైసీపీలోని 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్దమవుతున్నారు స్పీకర్. రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలపై పరిశీలన చేస్తున్నామన్నారు. మాజీ సీఎం జగన్ తప్ప, ఆ పార్టీకి చెందిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఏడాదిన్నరగా జీతాలు తీసుకొంటున్నారని వ్యాఖ్యానించారు.
ఒక ఉద్యోగి ఆఫీసుకు రాకుంటే సస్పెండ్ చేస్తున్నామని, మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుంటే తొలగించవద్దా? అంటూ ప్రశ్నించారు. ఈ లెక్కన వచ్చే సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీకి వెళ్లి లైవ్‌లో కనిపించాలని వైసీపీ ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు.
స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యల వెనుక
అలాగని పార్టీ అధినేత నిర్ణయాన్ని ధిక్కరించలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసెంబ్లీకి వెళ్లమని పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతారా? వద్దంటారా? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని భావిస్తున్నట్లు వైసీపీ నుంచి చిన్నపాటి ఫీలర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నచందంగా మారింది.
ALSO READ: జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు, మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ వ్యాఖ్యల వ్యవహారం వైసీపీలో ముసలం మొదలవ్వడం ఖాయమని అనేవాళ్లు లేకపోలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గం సమస్యలను చెప్పుకోవడానికి లేకుండా పోయిందని లోలోపల మదన పడుతున్నారు. ఈ లెక్కన స్పీకర్ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నాటికి వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎమ్మెల్యేల మాట ఏమోగానీ, అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ మాత్రమే.