Margashirsha Shukla Panchami 2024: మీకు నాగదోషం ఉందా.. మీరు సంతానం ప్రాప్తికి నోచుకోలేదా.. ఎన్నేళ్ల నుండో వివాహం కావట్లేదా.. అయితే మార్గశిర శుక్ల పంచమి రానే వస్తోంది. అంటే ఈనెల 6వ తేదీన మార్గశిర శుక్ల పంచమి. కాబట్టి మీరు ఈ ఒక్క పూజ చేయండి. ఆ దేవదేవుని అనుగ్రహంతో మీకు అన్నీ శుభాలే జరుగుతాయి.
మార్గశిర శుక్ల పంచమి రోజు నాగులను పూజించాలని శాస్త్రవచనం. శ్రావణమాసం పంచమి ఎంతో పుణ్యకరమైనది. ఈ తిధులలో నాగదోషం ఉన్నవారు , సర్పదోషం ఉన్నవారు , సర్ప హత్య చేసిన వారు, సంతాన హీనులు, జాతకములో పంచమాది స్థానాలలో రాహు కలవారు, పంచమిరోజు విశేష పూజలు చేస్తే సర్పదోషము దూరమవుతుంది. పామును నాగదేవతగా, నాగరాజుగా భావించి పూజించటం అనేది అనాదికాలం నుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. నాగాభరుణుడైన పరమశివుడు, శేష తలుపుడైన శ్రీమహావిష్ణువులను అత్యంత ప్రియమైన మాసంలో పంచమి నాడు నాగులును పూజించటం విశేష ఫలితాన్నిస్తుంది.
చాలా గ్రామాల్లో, దేవాలయాల్లో వేప లేదా రావిచెట్టు మొదల దగ్గర నాగ విగ్రహాలు తప్పకుండా ఉంటాయి. రెండు సర్పాలు పెనవేసుకున్న ఆకారంలో విప్పిన పడగలో శివలింగంతో ఎనిమిది మెలికలతో తీర్చబడిన సర్ప విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక చరిత్రలోకి వెళితే.. నాగులకు తల్లితండ్రులు కశ్యప, కద్రువ. కశ్యపనికి ఉన్న 21 మంది భార్యలలో కద్రువ ఒకరు. ఈమెకు కశ్యపని వల్ల వెయ్యి మంది పుత్రులు జన్మించారు. ఒక పుత్రిక కలిగారు. వీరిలో అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంకపాలుడు, ఐరావతుడు, ధనుంజయుడు, శేషుడు, కర్కోటకుడు అనే ఎనిమిది మంది సర్పజాతికి మూలపురుషులని పేరు.
ఈ నాగదేవతలే మిగిలిన సమస్త నాగజాతికి మూలపురుషులుగా, వారి స్వరూప స్వభావాలే మనకిప్పుడు కనిపిస్తున్న పాములలో ఉన్నాయని చెప్పొచ్చు. పాములు తక్షక వంశానికి, నల్ల త్రాచులు కర్కోటక వంశానికి చెందినవి. బంగారు రంగు పాములు అనంతుడి వంశానికి, తెలుపు రంగులోనే శేష శంఖపాల వంశానికి, కపిలవరణంతో ఉన్నవి వాసుకి వంశానికి, పసుపు రంగులో ఉండేవి ధనుంజయ వంశానికి, తెల్లగా లేక బూడిద రంగులో ఉండేవి ఐరావతవంసానికి చెందినవిగా ప్రతీతి. ఇవి నాగదేవతల వంశ స్వరూప స్వభావాలు.
కాగా సర్పదోషంతో ఉన్నవారు, సంతానలేమి కలవారు, నాగులును పూజిస్తే తత్వలితాలు కలుగుతాయని చెబుతారు. ముఖ్యంగా స్త్రీలు అభ్యంగన స్నానం చేసి సమీపంలో ఉన్న పాము పుట్ట దగ్గరకు వెళ్లి ముగ్గులు పెట్టి దీపారాధన చేసి పుట్ట చుట్టూ నూలు దారాలు చుట్టి, పసుపు, కుంకుమను అలంకరించి ప్రదక్షిణలు చేసి పుట్టలో ఆవుపాలు పోసి చలిమిడి నివేదించాలి. అది వీలు కాని వారు వెండితో కానీ, రాగితో కానీ చేసిన సర్పవిగ్రహాన్ని పూజించవచ్చు. నువ్వులు బెల్లం కలిపి చేసిన నువ్వుల పిండిని బియ్యప్పిండిని, బెల్లం కలిపి చేసిన చలిమిడిని ఆ సర్ప విగ్రహానికి నివేదించవచ్చు. కర్ణ సంబంధ వ్యాధులు ఉన్నవారు, రాహు దోషం, కుజదోషం ఉన్నవారు చాలా కాలంగా అవివాహితులుగా ఉన్న కన్యలు నాగారాధన చేస్తే సత్ఫలితం లభిస్తుందని ప్రతీతి .
పుట్టమన్ను కూడా అత్యంత శ్రేష్టమైనది. పుట్టమన్ను ధారణ చేసిన వారికి సత్వర ఫలితాలు లభిస్తాయి. సంతానం లేనివారు శివాలయాల్లో రావి చెట్టు వేప చెట్టును నాటి వాటి దగ్గర నాగ ప్రతిష్టలు చేస్తారు అలా చేయటం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం. ప్రకృతిలోని నాగ జాతులను గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పటంలో భాగంగానే ఇటువంటి పూజలు, నోములు, వ్రతాలు ఆచరిస్తారు.
ఏది ఏమైనప్పటికీ మార్గశిష్ట మాసం శుక్లపక్షం పంచమి రోజున నాగ ఆరాధన అనేది శాస్త్రంలో చెప్పబడింది. దానికి తగ్గట్టుగా నాగప్రతిమలను శక్తి మీద పూజించి నాగదేవతల అనుగ్రహాన్ని పొంది దోషాన్ని దూరం చేసుకోవచ్చు. – డాక్టర్ శృతి