Karthika Masam 2025: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మాసం శివకేశవుల ఆరాధనకు, ఉపవాస దీక్షలకు,దానధర్మాలకు విశేషమైనది. భగవంతుడికి దీపం సమర్పించడం ద్వారా అజ్ఞానమనే చీకటిని తొలగించుకోవాలని ఈ మాసం సూచిస్తుంది. కార్తీక మాసం సాధారణంగా అక్టోబర్/నవంబర్ మాసాల్లో వస్తుంది. అంతే కాకుండా కార్తీక పౌర్ణమితో ఈ మాసం ముగుస్తుంది.
కార్తీక మాసం చివరి రోజు విశిష్టత:
కార్తీక మాసం ముగింపు రోజును కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పూర్ణిమ అని అంటారు. ఈ రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది.ఈ రోజున చేసే దీపదానం, దానధర్మాలు, నదీ స్నానాలకు ఎనలేని పుణ్యం లభిస్తుంది.
ముఖ్య కారణం:ఈ రోజున త్రిపురాసురులను సంహరించి లోకానికి శాంతి చేకూర్చాడు కాబట్టి ఈ రోజును త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున దైవ శక్తులు భూమిపైకి వస్తాయని.. భక్తుల కోరికలు త్వరగా నెరవేరతాయని నమ్మకం.
దీపదానం: జన్మజన్మల పుణ్యం
కార్తీక మాసంలో దీపదానం చేయడం అనేది కేవలం కాంతిని ఇవ్వడం కాదు. తమ జీవితంలోని చీకట్లను తొలగించమని భగవంతుడిని వేడుకోవడం. చివరి రోజు దీప దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అఖండ ఫలితం: మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు, కేవలం కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేసినా.. మాసం మొత్తం చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
పాప పరిహారం: కార్తీక పౌర్ణమి రోజున, సాయంకాలం వేళ దీప దానం చేయడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు తొలిగిపోతాయని నమ్మకం.
మోక్ష ప్రాప్తి: ఈ మాసంలో నదీ స్నానం చేసి, దానం, దీప దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని.. జన్మ జన్మల పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతారు.
దీపదానం ఎలా చేయాలి?
కార్తీక పౌర్ణమి రోజున దీప దానం చేసే విధానం సులభంగా ఉంటుంది. కానీ భక్తి శ్రద్ధలు ముఖ్యం.
పవిత్ర స్నానం: ఉదయాన్నే నదీ స్నానం చేయడం లేదా ఇంట్లో తలస్నానం చేసి పవిత్రత పాటించాలి.
Also Read: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?
దీపం సమకూర్చడం: రాగి, వెండి, లేదా మట్టితో చేసిన కొత్త దీపాలను (కుందులను) తీసుకోవాలి. లేదా పాత దీపాన్ని శుభ్రం చేసి ఉపయోగించవచ్చు.
దానం: దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేయాలి. తెల్లటి లేదా ఎరుపు రంగు వత్తిని ఉపయోగించాలి. దీపంతో పాటు వస్త్రం, బెల్లం లేదా దక్షిణ వంటివి కలిపి దానం ఇవ్వాలి.
ప్రదేశం: సాయంకాలం వేళ గుడి ప్రాంగణంలో.. తులసి కోట, రావి చెట్టు, లేదా నదీ తీరంలో దీపాలను వెలిగించి దానం చేయాలి.
ఈ విధంగా కార్తీక మాసం చివరి రోజు దీప దానం చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభించడమే కాకుండా.. మన పూర్వీకులు, మనకు శాంతి, సుఖ సంతోషాలు కలుగు తాయని విశ్వాసం.