భారతీయ సాంప్రదాయాల్లో అత్యంత పూజనీయమైన వ్రతాల్లో సత్యనారాయణ వ్రతం ఒకటి. శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున లేదా శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని చేయడం అత్యంత మంగళకరమని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతి, ధనసమృద్ధి, సంతానభాగ్యం కలగాలని కోరుకునే భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ వ్రతాన్ని పాటిస్తారు.
ఈ వ్రతానికి సంబంధించిన పౌరాణిక కథ శ్రీ సత్యనారాయణ స్వామి మహిమను వివరిస్తుంది. ఒకసారి మహర్షులు, దేవతలు నారదమునిని అడిగారు భగవంతుని అనుగ్రహం పొందేందుకు సులభమైన మార్గం ఏమిటి అని. అప్పుడు నారదుడు శ్రీమహావిష్ణువుని దర్శించి అడగగా, ఆయన సత్యనారాయణ వ్రతం చేస్తే భక్తులకు సర్వసంపదలు కలుగుతాయి అని ఉపదేశించాడు.
వ్రత కథ ఇదే
ఈ వ్రతం కథలో ఒక పేద బ్రాహ్మణుడు, ఒక వ్యాపారి, ఒక రాజు గురించి చెబుతారు. మొదట పేద బ్రాహ్మణుడు తన జీవితంలో అనేక కష్టాలను అనుభవించేవాడు. ఒక రోజు నారదముని సలహా మేరకు సత్యనారాయణ వ్రతం చేసి, అనంతమైన ధనసంపదను, సంతోషాన్ని పొందాడు. అదే విధంగా వ్యాపారి కూడా ఈ వ్రతం ద్వారా తన కోల్పోయిన ధనం, కుటుంబాన్ని తిరిగి పొందాడు. చివరగా ఒక రాజు ఈ వ్రతాన్ని నిర్లక్ష్యంగా చేసినందుకు కష్టాలను ఎదుర్కొన్నాడు. దీంతో పశ్చాత్తాపంతో మళ్లీ వ్రతం చేయడం ద్వారా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు.
ఇలా వ్రతం చేయండి
సత్యనారాయణ వ్రతం చేయడానికి ముందు ఇల్లు శుభ్రం చేసి, పీఠం ఏర్పాటు చేసి, శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. పూజలో పంచామృతం, పుష్పాలు, పండ్లు, బెల్లంతో తయారైన ప్రసాదం సమర్పిస్తారు. వ్రతం అనంతరం కథ విని హారతి ఇచ్చి ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ వ్రతాన్ని ఒంటరిగా కూడ చేయవచ్చు. లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేయవచ్చు.
మత విశ్వాసాల ప్రకారం ఈ వ్రతం చేయడం వలన మన జీవితంలోని ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య సంబంధిత కష్టాలు తొలగిపోతాయి. వ్రతాన్ని నిజాయితీగా, భక్తితో చేస్తే ఏ కోరికనైనా భగవంతుడు నెరవేర్చుతారని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ వ్రతం ప్రత్యేకంగా పౌర్ణమి, గురువారం, శ్రావణ మాసం వంటి సమయాల్లో చేయడం మంచిదని చెబుతారు. దేశవ్యాప్తంగా సత్యనారాయణ వ్రతం ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతోంది. నగరాల నుండి గ్రామాల దాకా ఈ వ్రతాన్ని ప్రతి నెలా వేలాది మంది భక్తులు చేస్తూ ఉంటారు. ఇది కేవలం పూజ మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆచారం కూడా. సత్యనారాయణ వ్రతం భగవంతుని కరుణ పొందే సులభ మార్గం. ఈ వ్రతం మన జీవితంలో సత్యానికి, ధర్మానికి ప్రాధాన్యం ఇస్తారు.