శివాలయాలకు వెళ్ళినప్పుడు శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు. భక్తులు శివలింగం ముందు నిలబడి ప్రార్థన చేసిన తరువాత, నంది విగ్రహం దగ్గరికి వెళ్లి చెవిలో తమ కోరికలు చెబుతారు. చాలా మందికి ఇది ఒక పాత ఆచారం అని అనిపించినా, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఎంతో లోతైనది.
పురాణాల ప్రకారం నంది దేవుడు భగవంతుడైన శివుడి వాహనం మాత్రమే కాదు.. ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడు, శివద్వారపాలకుడు కూడా. నంది ఎప్పుడూ శివుని ఎదురుగా కూర్చుని ఆయనను ధ్యానిస్తూ ఉంటాడు. అందువల్లే భక్తులు తమ మనసులోని కోరికలు, బాధలు నంది చెవిలో చెబుతారు. అలా చెబితే అవి నేరుగా శివుడి చెవికి చేరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది.
శివుడు ఎల్లప్పుడూ గంభీరమైన ధ్యాన స్థితిలో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ లోతైన ధ్యానసమాధిలో ఉంటారని శాస్త్రాలు చెబుతాయి. అందుకే భక్తుల ప్రార్థనలు, కోరికలు నంది ద్వారా శివుడికి చేరుతాయని పురాణ విశ్వాసం. నంది తన చెవిలో వినిపించిన ప్రతి మాటను శివుడికి వెంటనే తెలియజేస్తాడని భావిస్తారు.
ఈ నమ్మకం ఎందుకు వచ్చింది?
ఈ ఆచారం కేవలం భక్తితో కూడిన నమ్మకం మాత్రమే కాదు, మనసులోని భారాన్ని తగ్గించే ఒక ఆధ్యాత్మిక మార్గం కూడా. భక్తుడు తన మనసులోని మాటలను దేవుడికి నేరుగా చెప్పడం ద్వారా మానసిక శాంతి పొందుతాడు. మనసులో ఉన్న కోరికను నంది చెవిలో చెప్పడం వలన నా సమస్య ఎవరో విన్నారు అనే నమ్మకం కలుగుతుంది. అది ఒక మానసిక ఉపశమనం కూడా అందిస్తుంది.
ఏ చెవిలో చెప్పాలి?
నంది చెవిలో చెప్పేటప్పుడు సాధారణంగా ఎడమ చెవిని ఉపయోగించడం శుభమని పండితులు చెబుతారు. నంది ముందు నిలబడి, కృతజ్ఞతతో, శాంతియుతంగా మన కోరికను చెప్పాలి. గట్టిగా కాకుండా, ఆరాధనతో, భక్తితో, నెమ్మదిగా చెప్పడం మంచిది. ఆ తరువాత నందిని నమస్కరించి శివలింగం వైపు చూసి మనసులో మా కోరిక నెరవేర్చు అని కోరుకోవాలి.
ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు… భక్తుడు, దేవుడి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధానికి ఇది ఒక ప్రతీక. భక్తుడు తన కోరికను నంది ద్వారా శివుడికి చేరుస్తూ భక్తుల నమ్మకాన్ని మరింత పెంచుతాడు. ఆధ్యాత్మికంగా చూస్తే నంది…. శివభక్తికి, విధేయతకు, విశ్వాసానికి చిహ్నం. నందిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడి ఎదుట వినమ్రతతో, శాంతిగా ఉండి, మన కోరికలను చెప్పుకోవడం. ఈ ఆచారం మనకు వినయాన్ని, భక్తిని, ఆత్మశాంతిని నేర్పుతుంది. నంది చెవిలో మన కోరికలు చెప్పడం అనేది ఒక విశ్వాసం.