Maoist Hidma: దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులలో ఒకరు హిడ్మా. అయితే ప్రస్తుతం అతని తల్లి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా భావిస్తున్న హిడ్మా తన తల్లిని కలవకుండా చాలా కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. హింసాత్మక మావోయిస్టు కార్యకలాపాలతో అతనికున్న అనుబంధం కారణంగా భద్రతా దళాలు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో.. ఆ తల్లి తన కుమారుడికి చేసిన పిలుపు మానవీయ కోణాన్ని.. ఉగ్రవాద భావజాలం కారణంగా కుటుంబాలు పడే వేదనను కళ్ళకు కడుతోంది.
హిడ్మా తల్లి మీడియా ద్వారా తన కొడుకుకు ఆవేదనతో కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు, ఆమె మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించాయి. ‘నీవు ఎక్కడ ఉన్నావు బిడ్డా, ఇంటికి వచ్చేయ్’ అని ఆమె భావోద్వేగంతో వేడుకుంది. ఈ మాటలు కేవలం ఒక తల్లి తన కుమారుడిని పిలవడం మాత్రమే కాదు.. అడవుల్లోని హింసా మార్గాన్ని విడిచిపెట్టి, సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకునే ఒక సామాన్య తల్లి ఆకాంక్షను తెలియజేస్తున్నాయి. తన కొడుకు హిడ్మా తిరిగి రాకపోతే తాను నిస్సహాయురాలిని అనే విషయాన్ని కూడా ఆ తల్లి విచారం వ్యక్తం చేశారు. ‘రాకపోతే నేనేం చేయగలను?’ అని ప్రశ్నిస్తూనే.. ఆ తల్లి తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. ‘నీవు ఎక్కడైనా దగ్గరలో ఉంటే అడవుల్లో వెతకడానికి కూడా వస్తాను. ఇంకేమి చెప్పాలి బాబూ.. ఇంటికి రా’ అంటూ కన్నీళ్లతో చేసిన ఆమె విజ్ఞప్తి స్థానికులను ఎంతగానో కదిలించింది. తన కొడుకు ఎక్కడున్నా.. అతనికి ఏ ఇబ్బంది కలగకుండా.. కనీసం ఒక్కసారి కలుసుకునే అవకాశం దక్కాలని ఆమె తీవ్రంగా ఆశిస్తున్నారు.
మావోయిస్టు కార్యకలాపాలలో హిడ్మా ప్రమేయం వల్ల అతని కుటుంబం అనుభవిస్తున్న ఆందోళన ఈ తల్లి మాటల్లో స్పష్టమవుతోంది. హింస, అజ్ఞాతవాసం కంటే ప్రశాంతంగా.. గౌరవంగా బతకడమే ముఖ్యమని ఆమె చెప్పారు. ‘ఇక్కడ మనం కష్టపడి పనిచేసి తినేద్దాం, ప్రజలతో కలిసి సద్భావనగా జీవిద్దాం’ అంటూ తన కుమారుడిని అడవులను విడిచిపెట్టి.. గ్రామ సమాజంలో సాధారణ జీవితాన్ని గడపాలని ఆమె బ్రతిమాలింది. ఈ తల్లి మాటల్లో కేవలం కుటుంబ ప్రేమ మాత్రమే కాక.. ఉగ్రవాద భావజాలంతో సంబంధం లేకుండా, ప్రజల మధ్య జీవించాలని, మంచి జీవితం గడపాలని మాటలు స్పష్టంగా తెలుస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న చాలా మంది యువకులు తమ కుటుంబాలకు దూరం కావడం, వారి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర మానసిక వేదనకు గురవ్వడం సాధారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో. హిడ్మా తల్లి చేసిన విజ్ఞప్తి మావోయిస్టు నాయకులతో అనుబంధం ఉన్న యువకులకు, వారి కుటుంబాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ALSO READ: Delhi Blast: ఎన్ఐఏకు ఢిల్లీ పేలుడు కేసు.. వెలుగులోకి కారుకు సంబంధించిన కీలక విషయాలు
హిడ్మా తల్లి చేసిన మనసును హత్తుకునే ఈ మాటలు ఛత్తీస్‌గఢ్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది గ్రామస్తులు ఆ తల్లి వేదనను అర్థం చేసుకుంటూ.. హిడ్మా ఇంటికి తిరిగి రావాలని ఆశిస్తున్నారు. ఒకవైపు భద్రతా దళాల వేట, మరోవైపు తల్లి ప్రేమపూర్వక పిలుపు ఈ రెండింటి మధ్య హిడ్మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. హిడ్మా లొంగిపోతే.. ప్రభుత్వం అతనికి పునరావాసం కల్పిస్తుందని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హిడ్మా తన తల్లి పిలుపు మేరకు ఇంటికి తిరిగి వస్తాడా..? లేక అడవుల్లోనే ఉండిపోతాడా..? అనే అంశంపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తల్లి వేదన చూస్తుంటే.. హింసా మార్గాన్ని విడిచిపెట్టి, సాధారణ జీవితంలోకి రావాలనే ఆకాంక్షను బలంగా చాటుతోందని చెప్పవచ్చు.
ALSO READ: Jackie Chan: జాకీ చాన్ మరణం పై వార్తలు.. బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా!