BigTV English

Simhachalam : ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం.. సింహాద్రి అప్పన్న..

Simhachalam : ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం.. సింహాద్రి అప్పన్న..

Simhachalam : తెలుగునేలపై గల పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వరాహ నృసింహ మూర్తి అవతారంలో దర్శనమిస్తాడు. విశాఖపట్టణానికి 11 కి.మీ. దూరంలో, సముద్రమట్టానికి 244 మీ ఎత్తున తూర్పు కనుమలలో సింహాచల క్షేత్రం ఉంది. ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్యదైవంగా, తనను నమ్మిన భక్తుల కొంగుబంగారంగా నిలిచే ఈ సింహగిరీశుడి ఆలయ చరిత్ర, అక్కడి ఇతర ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం.


పూర్వం వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు శాపం కారణంగా రాక్షసులుగా జన్మించి విష్ణు ద్వేషులైనారు. వీరే కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు అనే రాక్షస సోదరులుగా జన్మించారు. వీరిలో హిరణ్యాక్షుడిని వరాహావతారంలో విష్ణుమూర్తి సంహరించాడు. సోదరుడిని చంపిన విష్ణువుపై తీవ్ర ద్వేషంతో ఉన్న హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే కుమారుడు కలిగాడు.

బాల్యం నుంచే అపారమైన విష్ణు భక్తుడైన ఈ బాలుడిని తండ్రి హిరణ్యకశిపుడు.. హరి నామస్మరణ తగదని పలు రకాలుగా మందలించేవాడు. అయినా.. మానకపోవటంతో బాలుడనే కనికరం లేకుండా అతడిని చంపేందుకు రకరకాల ప్రయాత్నాలు చేస్తాడు. ఇందులో భాగంగానే నేటి సింహాచలం కొండమీది నుంచి బాలుడిని కిందికి తోసి వేయగా.. సాక్షాత్తూ విష్ణువే వచ్చి.. రెండు చేతులతో బాలుడిని పైకి లేపుతాడు.


తర్వాతి కాలంలో హిరణ్యకశిపుడిని విష్ణువు.. స్తంభం నుంచి ఆవిర్భవించిన నరసింహావతారంలో వచ్చి సంహరిస్తాడు. నరసింహావతారాన్ని చూసి కంపించిన ప్రహ్లాదుడు.. శాంతించమని కోరగా.. స్వామి అందుకు అంగీకరిస్తాడు. ఆ సమయంలో నా తండ్రిని, నా పినతండ్రిని చంపిన రూపాల కలయికతో సింహగిరిపై నిలిచి.. భక్తులను కాపాడాలని ప్రహ్లాదుడు కోరగా.. సరేనన్న విష్ణువు నేటి సింహాచలంలో వరాహ లక్ష్మీ నృసింహుని రూపంలో అవతరించాడు.

ఇక్కడి ఆలయానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి వరాహ నరసింహమూర్తి ఉగ్రావతారం. కనుక ఆయనకు చల్లదనం కలిగించేందుకు ఆషాడ, కార్తిక,మాఘ, వైశాఖ మాసాల ఆరంభంలో ఒక్కోసారి 120 కేజీల చొప్పున మేలిరకం చందనపు దుంగలను సానమీద అరగదీసి.. ఆ లేపనాన్ని స్వామి మూలమూర్తికి అలదుతారు. ఇలా.. ఏడాదికి 480 కేజీల చందనాన్ని స్వామి మూల విరాట్టుకు సమర్పిస్తారు. చందనపు పూత లేకుండా స్వామి మూలమూర్తిని నేరుగా తాకలేమని అక్కడి అర్చకులు చెబుతుంటారు. ఏటా వైశాఖ పౌర్ణిమ నాడు.. ఏడాదంతా పూసిన చందనాన్ని ఒలిచే కార్యక్రమం ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది.

ఇక్కడి ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. స్వామి దర్శనం తర్వాత భక్తులు గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని కప్ప స్తంభానికి ప్రదక్షిణ చేస్తారు. ఈ స్తంభం కింద సంతాన గోపాల యంత్రం ఉందనీ, సంతానం లేనివారు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే తప్పక సంతానయోగం కలుగుతుందని విశ్వాసం. గతంలో భక్తులు.. స్వామికి ఇక్కడే కప్పం చెల్లించేవారు గనుక ఇది దీనిని కప్పపు స్తంభం అనేవారనీ, అదే కాలక్రమంలో కప్ప స్తంభమైందని చెబుతారు.

ఇక్కడి గంగధార, సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించే భైరవ వాక, సింహగిరి కొండ క్రిందగల వరాహ పుష్కరిణి తదితరాలను భక్తులు దర్శించుకుంటారు. ఆలయంలో ఉదయం రోజూ మంగళ హారతి కార్యక్రమం, సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహపు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి సింహాచలం కొండల్లో పూసిన సంపంగి పూలతో మాలను అలంకరిస్తారు. అత్యంత సువాసన గల ఈ బంగారు రంగు ఉండే పూలను తర్వాత స్వామి ప్రసాదంగా అందరికీ అందజేస్తారు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×