PMDDKY: ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY) పథకంలో తెలంగాణ నుంచి 4 జిల్లాలకు చోటుదక్కింది. నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను PMDDKY జాబితాలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను PMDDKY పథకంలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల ఢీల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి, తాజాగా ప్రారంభమైన ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY)లో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఙతలు తెలియజేశారు.
ఉత్పాదకత పెంపు, పంటల మార్పిడి, నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచేవిధంగా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక చారిత్రాత్మక మార్పు తెచ్చే పథకం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎంపిక కాబడిన 4 జిల్లాలకు రూ.960 కోట్ల వార్షిక వ్యయంతో, ఆరు సంవత్సరాల పాటు అమలు చేయబోతున్న ఈ యోజన 36 కేంద్ర పథకాల సమన్వయంతో పాటు రాష్ట్ర పథకాలతో అనుసంధానం చేస్తారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఉత్పాదకత చూపుతున్న జిల్లాలలోని రైతులకు విస్తృతంగా లాభం చేకూరుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
వర్షాధార పద్ధతులపై అధికంగా ఆధారపడిన, తక్కువ ఉత్పాదకత కలిగిన జిల్లాలను ఈ పథకంలో చేర్చడం వలన తెలంగాణ రైతుల సంక్షేమమే కాకుండా దేశవ్యాప్తంగా ఆహార భద్రత, ఉపాధి అవకాశాల పెంపుకు తోడ్పడుతుందని వివరించారు. కేంద్రం నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హర్షం వ్యక్తం చేస్తారు.
ALSO READ: IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!
తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర పథకాలతో పాటు ఈ పథకాన్ని పూర్తిగా అనుసంధానం చేస్తూ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ యూనివర్శిటీలు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తామని అన్నారు. అలాగే డిజిటల్ మానిటరింగ్ ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.