Nagulachavithi : నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ‘ శ్రీమహావిష్ణువు”* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటం వెనుక అంతర్యమని కొంత మంది పెద్దలు చెబుతుంటారు. పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాస్తే నెయ్యిగా మారుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం.
బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.
నాగులచవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ * *ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు.అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
నాగులచవితి రోజున పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఈనెల 29న నాగులచవితి పర్వదినం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ మలయప్పస్వామి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్శమిస్తారని తెలిపారు. మలయప్ప స్వామి శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కలిసి ఊరేగుతారని పేర్కొన్నారు. 29న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుందని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలు అందుకుంటున్నారని టీటీడీ అధికారులు చెప్పారు.