Big Stories

Aus Vs SA Semifinal | ఫైనల్‌లో ఆస్ట్రేలియా.. ఇండియాతో ఫైట్‌కి రెడీ

Aus Vs SA Semifinal | వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియాకి ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పడుతూ లేస్తూ గెలిచి.. చివరికి ఫైనల్ చేరింది. ఇలా ఆడినందుకు మరింత పట్టుదలగా ఆడి, రేపు ఫైనల్ మ్యాచ్ లో ఇండియాకి గట్టి పోటీ ఇస్తారా? లేకపోతే ఇలాగే ఆడి, ఇండియా చేతిలో చావు దెబ్బ తింటారా? అనేది ఆదివారం వరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

అయితే కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. అందివచ్చిన అవకాశాన్ని వదులుకుంది. ఒక దశలో 11.5 ఓవర్లు అయ్యేసరికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 24 పరుగులు చేసి దిక్కుతోచని స్థితిలో గిలగిల్లాడింది.

- Advertisement -

ఈ సమయంలో డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. కానీ అతనికి జట్టు నుంచి ఎవరూ కూడా సహాయ సహకారాలు అందించలేదు. క్లాసెన్ (47) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అతడిని అడ్డం పెట్టుకుని సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు మిల్లర్ (101) ప్రయత్నించాడు. ఎట్టకేలకు 212 పరుగుల వద్ద సౌతాఫ్రికా కథ ముగిసింది. ఒక్క 20 పరుగులు ఎక్కువ చేసినా సరే, ఆస్ట్రేలియాను ఆపగలిగేవారే. కానీ ఆ అవకాశం లేకుండా చేసుకున్నారు. టాస్ గెలిచారు కానీ ఆ అవకాశం మాత్రం కోల్పోయారు.

తర్వాత బౌలింగ్ లోకి వచ్చి ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 క్యాచ్ ల వరకు వదిలేశారు. అలా ఆస్ట్రేలియాకి చేజేతులారా మ్యాచ్ ని అప్పగించారు. నిజంగా చెప్పాలంటే ఇది ఆస్ట్రేలియా గెలుపు కాదు. సౌతాఫ్రికా వచ్చిన అవకాశాలను జారవిడుచుకోవడం వల్ల ఆసిస్ పొందిన కానుక. దీనికి వాళ్లు సంబరాలు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు.

కాకపోతే లోస్కోర్ గేమ్ అయినా సరే, ఆసాంతం టెన్షన్ గానే సాగింది. ముఖ్యంగా సౌతాఫ్రికా బౌలర్లు చాలా కష్టపడ్డారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి అందుతున్న సహకారంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

213 స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (62) అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. 6 ఓవర్లలో 60 పరుగులకి మ్యాచ్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియా జట్టులో టెన్షన్ రిలీజ్ చేశాడు. 48 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్స్ లతో సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వార్నర్ (29), మిచెల్ మార్ష్ (0), స్టీవ్ స్మిత్ (30), లబూషేంగ్ (18), మ్యాక్స్ వెల్ (1) ఇలా అందరూ స్వల్ప స్కోరుకే వెనుతిరగడం వల్ల పరిస్థితిని పీకలమీదకు తెచ్చుకున్నారు.

ఒక దశలో 14.1 ఓవర్ల అయ్యేసరికి 3 వికెట్లకు 106 పరుగులతో ఉన్న ఆసిస్ 33.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగుల వద్దే ఆగిపోయింది. ఆ మిగిలిన పరుగులు చేయడానికి నానా అవస్థలు పడింది.

ఈ సమయంలో కూడా ఇచ్చిన క్యాచ్ లను వికెట్ కీపర్ డికాక్ లాంటి వాళ్లే వదిలేశారు. ఇకంతే ఆస్ట్రేలియా నవ్వుకుంటూ లాంఛనం పూర్తి చేసింది. పడుతూ లేస్తూ 47.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యం పూర్తి చేసి విజయం సాధించి ఫైనల్ లో ఆసీస్ అడుగు పెట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News