హిందూ సంప్రదాయాల్లో ఏకాదశికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుభక్తులు ఉపవాసం, పూజలు చేస్తారు. ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణుభగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దాదాపు ప్రతి హిందూ ఇంట్లో తులసి కోట ఉంటుంది. రోజూ తులసికి పూజ చేయడం ఆనవాయితీగా మారింది. కానీ ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కోయకూడదన్న సంప్రదాయం ఉంది.
ఏకాదశికి తులసికి సంబంధం
పురాణాల ప్రకారం ఏకాదశి రోజున విష్ణుభగవానుడు ఉపవాసంలో ఉంటాడని, అదే సమయంలో తులసి దేవి కూడా విశ్రాంతి లేదా తపస్సులో ఉంటుందని నమ్మకం. అందువల్ల ఆ రోజున తులసి ఆకులను కోయడం ఆమెకు బాధ కలిగించినట్లుగా భావిస్తారు. ఏకాదశి రోజు తులసి దేవి విష్ణుభగవానుడి భార్యగా పూజలు అందుకుంటుందని పురాణ కథలు చెబుతాయి. అందుకే ఈ పవిత్ర రోజున తులసిని కోయడం పాపంగా భావించి, ముందురోజే తులసి ఆకులను కోసి పూజకు సిద్ధం చేసుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
ఆయుర్వేద కారణాలు
ఈ ఆచారానికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆయుర్వేద పరమైన కారణాలు కూడా ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. తులసి ఒక జీవ మొక్క కావడంతో దానిలో ప్రత్యేకమైన శక్తి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. ఏకాదశి నాడు చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో తులసి ఆకులను కోయడం వల్ల దాని ఔషధ గుణాలు తగ్గే అవకాశం ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకే ఆరోగ్యపరంగా కూడా ఆ రోజు తులసిని కోయకుండా ఉండటం మంచిదని పెద్దలు చెబుతారు.
ఇక పూజా విధానాల విషయానికి వస్తే, ఏకాదశి నాడు తులసి ఆకులు లేకుండా కూడా పూజ చేయవచ్చని పండితులు చెబుతారు. ముందురోజు కోసిన తులసి ఆకులను శుభ్రంగా నీటిలో ఉంచి, ఏకాదశి రోజున విష్ణు పూజలో వినియోగించవచ్చు. లేదా కేవలం తులసి మొక్కకు నమస్కరించి, నీరు పోసి పూజ చేయడం కూడా సరిపోతుందని చెబుతారు. తులసి ఆకులు లేకపోయినా భక్తితో చేసే పూజకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడన్నది శాస్త్రాల భావన.
మతపండితుల ప్రకారం ఏకాదశి నాడు తులసి ఆకులు కోయకూడదన్నది కఠినమైన నియమం కాదు, ఒక సంప్రదాయ విశ్వాసం మాత్రమే. ఎవరికైనా తెలియక తులసి ఆకులు కోసినా దోషం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తులసిని పూజించేటప్పుడు భక్తి, శ్రద్ధే ప్రధానమని శాస్త్రాలు చెబుతున్నాయి. యినప్పటికీ పెద్దలు చెప్పిన సంప్రదాయాలను గౌరవిస్తూ పాటించడం వల్ల మనలో నియమశీలత, ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని నమ్మకం. అందుకే ఈ రోజుకీ చాలా మంది ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకుండా ముందే సిద్ధం చేసుకుని పూజలు చేస్తున్నారు.