Yaksha questions: మహాభారతంలో అనేక మహత్తరమైన కథలు ఉన్నాయి. కానీ అందులో యక్ష ప్రశ్నలు అనే జరిగిన సంఘటన మాత్రం చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే ఆ ప్రశ్నలు కేవలం ఒక సంభాషణ కాదు… మనిషి జీవితాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకునే పరీక్షలుగా నిలిచాయి.
కొంగ రూపంలో యక్షుడు
పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒకసారి వారు అడవిలో విపరీతమైన దాహంతో అలమటిస్తారు. ముందుగా నకులు ఒక సరస్సు వద్దకు వెళ్ళాడు. కానీ అక్కడ ఒక కొంగ రూపంలో ఉన్న యక్షుడు అడ్డం నిలిచాడు. “నా ప్రశ్నలకు సమాధానం చెప్పకముందు ఈ నీటిని తాగితే ప్రాణాలు కోల్పోతావు” అని హెచ్చరించాడు. దాహంతో ఉన్న నకులు దాన్ని పట్టించుకోకుండా నీరు తాగగానే క్షణాల్లో మూర్ఛపోయి పడిపోయాడు.
అలాగే తరువాత సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా ఒక్కొక్కరుగా వెళ్లి నీరు తాగుతారు. వారందరూ కూడా అదే పరిస్థితికి గురవుతారు. చివరికి యుధిష్ఠిరుడు అక్కడకు చేరుకుంటాడు. అతనిని కూడా యక్షుడు అదే మాటతో ఆపాడు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం అహంకారం లేకుండా యక్షుడి మాట విని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యాడు.
ఇక్కడే ప్రారంభమయ్యాయి యక్ష ప్రశ్నలు.
యక్షుడు వేసిన ప్రశ్నలు సాదాసీదాగా కనిపించినా లోతైన తాత్త్విక భావన కలిగివుంటాయి. “ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది ఏమిటి?” అని అడిగితే యుధిష్ఠిరుడు “మనసు” అని సమాధానం చెప్పాడు. “మనిషికి కంటే గొప్ప ధనం ఏమిటి?” అంటే “సంతృప్తి” అన్నాడు. “భూమిపై అతి పెద్ద భారం ఏమిటి?” అన్న ప్రశ్నకు “ఋణబాధ” అన్నాడు. “స్నేహితుడి కన్నా ఎవరు దగ్గర?” అంటే “తల్లి” అని చెప్పాడు.
దాదాపు 125 ప్రశ్నలు
ఇలాగే మొత్తం దాదాపు 125 ప్రశ్నలు అడిగిన యక్షుడికి, యుధిష్ఠిరుడు ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆ సమాధానాల్లో యుధిష్ఠిరుడి జ్ఞానం, ధర్మబోధ, సహనం, జీవితానికి అర్థం ఇచ్చే విలువలు అన్ని వ్యక్తమయ్యాయి.
యమధర్మరాజే
ఇక చివరిగా చెప్పాల్సింది, ఇప్పటి వరకు కఠోరమైన ప్రశ్నలతో యుధిష్ఠిరుడికి ప్రశ్నించిన యక్షుడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. ఆయన ఎవరో కాదు యమధర్మరాజే. తన పుత్రుడైన యుధిష్ఠిరుని పరీక్షించేందుకు యక్ష రూపంలో వచ్చాడని చెప్పాడు. యమధర్మరాజును చూసిన యుధిష్ఠిరుడు ఆశ్చర్యంగా ఆయనను చూస్తూ ఉండిపోయాడు. తరువాత నమస్కరించాడు. యుధిష్ఠిరుడు సమాధానాలకు సంతృప్తి చెంది, ధర్మం నుంచి ఎప్పుడూ తొలగలేదని, కష్టసమయంలో కూడా సహనంతో సమాధానం చెప్పాడని సంతోషించి నలుగురు పాండవుల ప్రాణాలను తిరిగి ఇచ్చాడు.
ఈ సంఘటన మనకు చెప్పే బోధ ఏమిటంటే, కష్టసమయంలో ఆవేశం కాకుండా జ్ఞానం, సహనం, ధర్మబుద్ధితో ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. యక్ష ప్రశ్నలు అంటే కఠినమైన ప్రశ్నల ప్రతీక. ఇవి కేవలం పాండవులను రక్షించినవి కాదు… మనిషి జీవన మార్గాన్ని కూడా వెలుగులోకి తెచ్చినవి.