Tough Fight In Vizag Assembly Constituency Sri Bharath vs Botsa Jhansi : రెండు కుటుంబాలూ రాజకీయంగా.. ఆర్థికంగా పరిపుష్టి కలిగినవే. ప్రభుత్వ పథకాలతో పాటు తాము గెలిస్తే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని సీఎం జగన్ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉన్న అమరావతిని కాదని విశాఖను రాజధానిగా ఎలా చేస్తారని కొందరు అంటుంటే.. తమ ప్రాంతం రాజధానికి అన్ని విధాలా అనుకూలమనే భావనలో కొందరు ఉన్నారు. ఇంత చెప్పాక.. ఆ నియోజరవర్గం ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. సాగరి నగరి గురించే అంత ఇంట్రడక్షన్. విశాఖ పార్లమెంటు అభ్యర్థులుగా ఇద్దరు హేమాహేమీలున్నా.. రాజధాని అంశం ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ అవుతుందనే లెక్కలతో ఆ ప్రాంతంలో హీట్ నెలకొంది.
2024లో జరిగిన ఎన్నికలు.. రాజకీయపార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎప్పటికీ కోలుకోలేదని టీడీపీ చెబుతుండగా.. తాము గెలిస్తే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామంటూ వైసీపీ చెప్పుకోస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై.. ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా.. విశాఖలో మాత్రం పొలిటికల్ హీట్ మరింత వేడిక్కింది. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పటమే కాదు. ఒక అడుగు ముందుకేసిన జగన్.. తన ప్రమాణస్వీకారం విశాఖలోనే ఉంటుందని ప్రకటన కూడా చేసేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే సాగరనగరంలో పొలిటికల్ అలలు ఎగిసి పడుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో.
మరోవైపు.. విశాఖ ఎంపీ స్థానానికి ప్రత్యేకత ఉంది. అక్కడ గెలిచేందుకు వైసీపీతో పాటు టీడీపీ కూడా చాలా ఫీట్లు చేసిందనే చెప్పొచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ రూపురేఖలు మార్చేస్తామని జగన్ చెబుతుంటే… అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ..విశాఖను డెవలప్‌మెంట్ చేస్తామని తెలుగుదేశం చెప్పుకొస్తోంది. విశాఖ పరిపాలన రాజధానిపై జనాల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రుల రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత.. విశాఖను ఎలా ప్రకటిస్తారని కొందరు అంటుంటే.. తమ ప్రాంతానికి క్యాపిటల్ అయ్యే పరిస్థితులన్నీ ఉన్నాయని మరికొందరు ఆలోచనలో ఉన్నారట. మిగిలిన ప్రాంతాల్లో మాటెలా ఉన్నా ఈ విషయంలో విశాఖ వాసులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
Also Read: కైకలూరులో దూలంకి షాక్ ? ఈ సారి ఓటమి తప్పదా..
విశాఖను రాజధానిగా చేస్తామనే వైసీపీ హామీ.. బొత్స ఝాన్సీకి పాజిటివ్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలు తమవైపు ఉన్నారని జగన్ అండ్‌కో భావిస్తోంది. ఇదే జరిగితే… ఝాన్సీ విజయం సునాయాసమనే వాదన ఉంది. అలా కాకుండా.. అమరావతినే రాజధానిగా ఉంచాలనే జనం కోరుకుంటే మాత్రం.. టీడీపీ అభ్యర్థి భరత్‌కు ఎడ్జ్ ఉందనే టాక్ నడుస్తోంది.
ఎందుకంటే.. విశాఖను రాజధానిగా చేయటాన్ని మేధావులతో పాటు కొందరు సామాన్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలే విభజన గాయంతో ఉన్న రాష్ట్రానికి.. జగన్ నిర్ణయం వల్ల రాజధాని కూడా లేకుండా పోయిందనే భావనలో ఉన్నారు. కొంతవరకూ ప్రారంభమైన అమరావతిని.. స్వార్థ ప్రయోజనాలు కోసం నిలిపివేశారనే వాదన ఉంది. దాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదని పైకి చెబుతున్నా.. ఓ సామాజికవర్గాన్ని బలహీన పర్చే విధంగా జగన్ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఇది.. ఝాన్సీ, భరత్ విజయంపై ఆధారపడి ఉందనే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు.. ఎవరూ ఊహించని విధంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ ఝాన్సీని.. వైసీపీ అధిష్టానం తెరపైకి రావటం కూడా ఆశ్చర్యం కలిగించే అంశమే. సిట్టింగ్ ఎంపీ ఎంవీవి సత్యనారాయణను విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపారు. అమరావతి అంశంపై జగన్‌తో పాటు చంద్రబాబు కూడా స్పష్టమైన ప్రకటన చేసేశారు. జగన్‌ను గెలిపిస్తే.. అమరావతి రాజధానిగా ఉండదని.. ఆ విషయాన్ని ప్రజలే తేల్చుకోవాలని డైరెక్ట్‌గా చెప్పేశారు. అంతేకాదు. విశాఖలో ఉండే సహజవనరుల్ని వైసీపీ నేతలు దోచుకున్నారని ఇదే కొనసాగించటం కోసం మరోసారి రాజధాని పేరుతో డ్రామాలని కుండబద్దలు కొట్టేశారు. దీంతో.. ఎటు వైపు ఉండాలో తేల్చుకోలేని ప్రజలు ఓటు ద్వారా తమ సమాధానాన్ని చెప్పగా.. ప్రస్తుతం అవి ఈవీఎంలో
భద్రంగా ఉన్నాయి.
విజయనగరం జిల్లా నుంచి రాజకీయాలు చేస్తున్న బొత్స కుటుంబం.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెనక్కి తగ్గలేదు. బరిలో ఝాన్సీని నింపాలన్న జగన్ కోరిన వెంటనే సత్యనారాయణ ఓకే అనేశారు. దానికి తోడు జోరుగా ప్రచారం కూడా సాగించారు. ప్రత్యర్ధులు తమ ప్రచారంలో.. బొత్స ఝాన్సీ నాన్‌లోకల్ అనే ప్రచారం చేసినా ధీటుగా తిప్పికొట్టి ముందుకు సాగారు. ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకుంటూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
గతంలో బొబ్బిలి, విజయనగరం ఎంపీగా పనిచేసిన అనుభవంతో విశాఖను అభివృద్ధి చేస్తానని ఝాన్సీ చెబుతున్నారు. మరోవైపు.. కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ కూడా ఇచ్చేశారు. దీంతో విశాఖ సెగ్మెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని వైసీపీ చెబుతుంటే.. ప్రశాంతంగా ఉంటే సాగరతీరంలో అల్లకల్లోలం సృష్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో విశాఖ నగరం ప్రత్యేకమంటున్న కూటమి నేతలు.. రాజధానిగా కాకుండా.. మహానగరంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.
Also Read: రాయచోటి నియోజకవర్గంలో.. ఈసారి జెండా పాతేదెవరు?
టీడీపీ అభ్యర్థి విషయానికి వస్తే.. మతుకుమిల్లి భరత్.. గత ఎన్నికల్లో 4వేల 567 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి చెందారు. అప్పుడు జనసేన నుంచి CBI మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ బరిలో నిలవటం.. తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం కలిగించిందని లేకుంటే.. భరత్ విజయం ఖాయమనే వాదనలూ వినిపించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి తోడు జనసేన, బీజేపీ కూడా కలవటంతో ఈ సారి సీటు పక్కా అనే ధీమాలో టీడీపీ ఉంది.
బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపతామని.. దీంతోపాటు రైల్వేజోన్, విశాఖ అభివృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే కూటమి నేతల హామీలు తన విజయానికి దోహదం చేస్తాయని భరత్ ధీమాగా ఉన్నారు. రెండు బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలకు తోడు సీఎం జగన్ విశాఖపై ప్రత్యేక దృష్టి సారించటం వైసీపీకి కలిసివచ్చే అంశంగా మారితే చంద్రబాబు ఇంట్లో మనిషిగా లోకేష్ తోడల్లుడుగా భరత్ విజయానికి అవకాశాలూ ఉన్నాయి. హీరో బాలయ్య చిన్న అల్లుడైన భరత్.. విద్యాసంస్థల అధిపతిగానూ పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారోననే ఉత్కంఠ నెలకొంది.