Reddappagari Couple in Kadapa: కడప అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ పాగా వేసింది. నాలుగు ఓటముల తర్వాత దక్కిన భారీ విజయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పెద్ద బూస్టప్ ఇచ్చింది. కడపకు శాశ్వత పాలకులం తామే అని అధికారదర్పంతో విర్రవీగిన ప్రత్యర్థులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆరు నెలల కిందట కడప రాజకీయాల్లోకి ప్రవేశించి పసుపు జెండాను రెపరెపలాడించిన ఈ ఘనత నిస్సందేహంగా రెడ్డప్పగారి మాధవిదే అనటంలో సందేశం లేదు. కడప నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆమె చరిత్ర సృష్టించారు.
కడప అసెంబ్లీ నియెజకవర్గం.. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆ ఫ్యామిలీకి అడ్డాగా మారిపోయింది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ అక్కడ రెండు సార్లు గెలిస్తే.. వైసీపీ ఆ తర్వాత కడపలో పాగా వేసింది. ఎమ్మెల్యే, ఎంపీ అఖరికి స్థానికి సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ క్రమంలో కడపలో తెలుగుదేశం ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో కడప పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు రెడ్డప్పగారి దంపతులు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య మాధవిరెడ్డిలు ఎన్నికలకు ఆరు నెలల ముందు కడపలో అడుగుపెట్టారు.
కడప అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ ఇన్చార్జ్‌గా మాధవిరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలోని కీలక నాయకులు ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. సహకరించే ప్రశ్నే లేదని వారు తేల్చి చెప్పారు. ఈ సవాళ్లను దాటుకుంటూ తన భర్త శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో పార్టీ పటిష్టానికి కృషి చేసి.. నమ్మకమైన కేడర్ని ఏర్పాటు చేసుకున్నారు. నగరంలోని ప్రతి ఇంటి గడపతొక్కి ఓట్లను అభ్యర్ధించారు. స్థానికులు చెప్పే సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి హామీలిచ్చారు.
Also Read: ఐదేళ్ల పోరాటానికి ముగింపు.. అమరావతీ.. ! ఊపిరి పీల్చుకో.. బాబు వచ్చాడు
వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లిన మాధవీరెడ్డికి సొంత పార్టీలోని పెయిడ్ నేతలతో పాటు.. వైసీపీ వారి నుంచి ప్రతిఘటనలు ఎదురైనా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి , మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అక్రమాలపై మాధవి విరుచుకుపడ్డారు. అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ టూటౌన్ పోలీస్ స్టేషన్ ముందు బహిరంగంగా బెదిరించినా డోంట్ కేర్ అన్నారు. అదే మాధవిని కడప ఓటర్లకు దగ్గర చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక మ్యానిఫెస్టోను సిద్ధం చేసి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అనుమతితో దానిని ప్రకటించారు.
మహిళలపై వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, అంజాద్‌బాషా వర్గం అరాచకాలను ఎండగట్టారు. ఇది నగర ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించగా మాధవి ధైర్యంగా ఎదుర్కొన్న తీరు రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాధవిని కడప రెడ్డమ్మగా అభివర్ణించారు. ఎన్నికల్లో 18,860 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి ఇప్పుడు అందరితో కడప రెడ్డప్ప అనిపించుకుంటున్నారు.