ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎవరిని విజేతలుగా చేస్తాయో చెప్పడం సాధ్యం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెజారిటీ సాధిస్తారని పోలింగ్ ముగిసే నాటికి ఓ క్లారిటీ వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక సీట్లు సాధిస్తారని ఓటర్లు వారి శైలిలో కన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అంటే ఎనలిస్టులు సైతం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఓటర్లు వారి అభీష్టాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసి నిగూఢంగా వ్యవహరిస్తున్నారు.
దాంతో ఎవరు గెలుస్తారు అన్న అంశంపై రాజకీయ విశ్లేషకులకు కూడా ఓ క్లారిటీ లేకుండా పోయిందంట. అయితే అభ్యర్థులు మాత్రం భలే ఖుషిగా కనిపిస్తుండటం విశేషం. ఓటమి అన్న ఆలోచన మదిలోకి రానీయడం లేదు. గెలిచి తీరుతామన్న వాదన బలంగా వినిపిస్తున్నారు. అయితే గెలుపు పై వారికి ఉన్న నమ్మకం ఏంటి అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, యువత పైనే రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. ఆ నమ్మకం నిజమవుతుందా, లేదా కాని పార్టీ నేతల నమ్మకం చూస్తూ బెట్టింగురాయుళ్లు మాత్రం చెలరేగిపోతున్నారు.
Also Read: విజయనగరంలో ఉత్కంఠపోరు.. మీసాల గీత రిటర్న్ గిఫ్ట్ ఏ పార్టీకి?
సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాటి నుంచి ఎన్నికల కోడ్ వచ్చే వరకు సంక్షేమం పథకాల పేరుతో నవరత్నాలు వెదజల్లారని.. ఆ సంక్షేమ ఫలాల ప్రభావంతో మహిళలు, వృద్ధులు తమ పార్టీని మరోసారి ఆదరించి తీరుతారని వైసీపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. డీబీటీ రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లోకి మధ్యవర్తులు లేకుండా జమ అయిన నగదు పథకాలు ప్రసారం చేయని ప్రకటనల మాదిరిగా తమ విజయానికి దోహదపడతాయని వైసీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. ఇలా ఐదేళ్లలో జగన్ చేసిన బటన్ రాజకీయాలన్ని చెప్పుకుంటూ వైసీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. దానికి తోడు స్థానికంగా తమకున్న పలుకుబడి కూడా ప్లస్ అవుతుందని ఆ పార్టీ కేండెట్లు తమ కేడర్‌కు భరోసా ఇస్తున్నారు.
మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకోవడానికి చేయాల్సిందంతా చేసింది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ సమయంలో చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించడంతో పాటు సూపర్ సిక్స్, బాబు భరోసా హామీలతో.. మహిళలు, వృద్దులు, యువత టార్గెట్‌గా ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి, అమలు చేసే సంక్షేమ పథకాలపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నుంచి క్షేత్రస్థాయిలో అభ్యర్థుల వరకు ముమ్మర ప్రచారం చేశారు.
మరోవైపు జగన్ పాలనలో పెరిగిన కరెంట్ చార్జీలు, ఇసుక కొరత, పడకేసిన అభివృద్దిపై విస్తృతంగా జనంలోకి వెళ్లారు. ఇక వైసీపీ బిల్లు పాస్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కూడా టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కొత్త చట్టంతో ప్రజల భూములు, ఆస్తులను వారి చేతుల్లో నుంచి లాగేసుకుంటారనీ, కబ్జాకోరులు చెలరేగిపోతారని మిత్రపక్షాల నేతలు చేసిన ప్రచారం రూరల్ ప్రాంతాల ఓటర్లపై ప్రభావం చూపించిందంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా అవినీతి రాజ్యమేలిందని.. అరాచక పాలన కొనసాగిందని విమర్శల వర్షం కురిపించారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ సమీకరణలు కూడా ఈ సారి ఫలితాలపై ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. జిల్లాలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంలో కీరోల్ పోషించారు. తర్వాత అయిదేళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా జిల్లా వైసీపీ నేతలతో సాన్నిహిత్యం కొనసాగించిన వేమిరెడ్డి.. పలు అభివృద్ది కార్యక్రమాల్లో తనదైన మార్క్ చూపించారు. జిల్లా వైసీపీని తన వెంట నడిపించుకున్న ఆయన ఈ సారి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడం తమకు మరింత ప్లస్ అయిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు..
Also Read: అద్దంకి ఎవరి కైవసం? గొట్టిపాటికి ఈసారి వైసీపీ చెక్ పెడుతుందా..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నడూ లేని విధంగా అనేక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రాత్రి వరకు సాగింది. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యాహ్నం పైన వచ్చిన ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసాయిని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ సమయంలో వచ్చిన ఓటర్లు రాత్రి 12 వరకు కూడా క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ పాలనతో విసిగిపోయి మార్పు కోరుకోవడం వల్లే వారంతా బూత్‌లకు క్యూకట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.
అదేవిధంగా మహిళలు, వృద్ధులు అత్యధికంగా తమ పార్టీకి ఓట్లు వేశారని.. వారంతా జగనన్న పాలనే కోరుకుంటున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు . ఇలా మహిళలు, వృద్ధులు యువతపై ఎవరి నమ్మకం వారు వ్యక్తం చేస్తుండటంతో.. అసలు ఆయా వర్గాల ఓటర్ల మొగ్గు ఎటు ఉందనేది అంతుపట్టకుండా తయారైంది. కౌంటింగ్ గడువు సమీపిస్తుండటంతో బెట్టింగ్ బాబులు ఎవరి నమ్మకంతో వారు కాయ్ రాజా కాయ్ అంటుండటంతో లక్షల రూపాలయు చేతులు మారుతున్నాయి. మరి చూడాలి ఈ సారి ఎవరి పంట పండుతుందో.