Nara Lokesh: విశాఖపట్నం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీకి కేంద్రంగా మారుతోంది! ఒకప్పుడు స్టీల్ ప్లాంట్, పోర్ట్ లతో ప్రసిద్ధి చెందిన ఈ నగరం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగాలలో పెట్టుబడుల వర్షంతో తడిసి ముద్దవబోతోంది. భవిష్యత్ టెక్నాలజీకి గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా విశాఖ అవతరిస్తున్నది. టెక్నాలజీ ప్రపంచంలో విశాఖ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, అపారమైన మానవ వనరులు, అత్యద్భుతమైన మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలను విశాఖ వైపు ఆకర్షిస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐటీ సంస్థలతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తుండడంతో విశాఖ ఫ్యూచర్ సిటీగా మారుతుంది అనడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే TCS లాంటి బడా ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు విశాఖను ఐటీ అండ్ డేటా సెంటర్స్ కు కేంద్రంగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఐటీ కమ్యూనికేషన్ అండ్ ఏఐ అభివృద్ధికి విశాఖను కేంద్ర బిందువుగా చేయాలనే ఆలోచన చేస్తుండడంతో భవిష్యత్తులో లక్షల ఐటీ ఉద్యోగాలను విశాఖలో కల్పించగలము అనే భరోసాను ఏపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే విశాఖలో అనేక చోటామోటా ఐటీ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు విశాఖ కేంద్రంగా డేటా సెంటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. విశాఖలోని APIIC ఐటి హిల్స్ లో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ లాండింగ్ సెంటర్ కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. 3.6 ఎకరాలలో 50 మెగావాట్ల ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను 1500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. సిఫీ చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో ఇండియాతో పాటు ఆగ్నేయ ఆసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ దేశాల మధ్య డేటా ప్రాసెసింగ్ వేగంగా జరగడానికి విశాఖలో ఏర్పాటు చేయబోతున్న కేబుల్ లాండింగ్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
విశాఖలో ఇప్పటికే TCS 1400 కోట్ల పెట్టుబడితో డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. TCS సొంత క్యాంపస్ ను ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 22 ఎకరాలను కేటాయించడంతో రానున్న రెండు సంవత్సరాల్లో ఈ క్యాంపస్ ను నిర్మించి కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకునే లోపు ఐటీ హిల్స్ లోని మిలీనియం టవర్స్ లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ విశాఖలో లక్ష కోట్లతో 1000 మెగావాట్ల టిసిఎస్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనితోపాటు 56 వేల కోట్లతో గూగుల్, 87 వేల కోట్లతో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి వచ్చాయి. ఇప్పటికే ఏపీ క్యాబినెట్లో ఈ సంస్థల ఏర్పాట్లకు నిర్ణయాలు కూడా తీసుకుంది ప్రభుత్వం. ఈ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖలో ఎన్నో స్టార్టప్ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే విశాఖలో అనేక ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు గూగుల్, మెటా,కాగ్నిజెంట్, సిఫీ,యాసెంచర్ లాంటి ఐటీ అండ్ డేటా సెంటర్లో ఏర్పాటు చేస్తే యువతకు లక్షల ఉద్యోగాలు ఒక్క విశాఖలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. విశాఖ కేంద్రంగా ఐటి అండ్ డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తే..ఐదు లక్షల ఉద్యోగాలు ఒకేచోట క్రియేట్ చేయొచ్చని కూటమి సర్కార్ భావిస్తోంది.
ఏపీ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీను నిలబెట్టుకోవడానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాల్లో వివిధ సమ్మిట్లలో ఐటీతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుతో పాటు మౌలిక సదుపాయాలను కూడా కల్పించే దిశగా చర్యలు చేపడుతుంది. ఈనెల 14వ తేదీన సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో భేటీ అయి విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల వివరాలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వీటితోపాటు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు, నక్కపల్లి లోని ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఇలా దాదాపుగా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చించే అవకాశం కనిపిస్తుంది.
Also Read: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లో అనేక దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కార్యరూపం దాల్చేలాగా చర్యలు చేపడుతుంది. రానున్న మూడున్నరేళ్లలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నది.విశాఖను ఐటి అండ్ డేటా సెంటర్ హబ్ గా మారిస్తే ఒక్క విశాఖలోనే ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని భావించి ముందడుగు వేస్తుంది. ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న కొత్త పాలసీలతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అండ్ ఏపీ భవిష్యత్తు ఎంత మారుతుందో చూడాలి.