ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమికే ఓటర్లు జై కొట్టారని. టీడీపీ కూటమికి 106 నుంచి 119 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. వైసీపీ 56 నుంచి 69 సీట్లకు మాత్రమే పరిమితం కానుందని తెలిపింది. అలాగే ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో.. టీడీపీ కూటమికి 17నుంచి 18 గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
బిగ్ టీవీ ముందు నుంచి చెపుతుందే నిజమని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమినే విజయం వరించబోతోందని దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఏపీలో లోక్‌సభతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్టీఏ కూటమి విజయదుందుభి మోగించబోతోందని జాతీయ మీడియా ఛానెళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ స్పష్టం చేశాయి.
ఇటీవలి కాలంలో దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే.. లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి 21 నుంచి 23 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53శాతం ఓట్లు రావొచ్చని అధికార వైసీపీ 41 శాతం ఓట్లతో కేవలం 2 నుంచి 4 ఎంపీ సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది.
Also Read: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై.. వైసీపీ నేతల్లో భయం
అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్‌సభ మాదిరిగానే ఫలితాలుంటాయని పలు సర్వేలు తేల్చాయి. ఎగ్జిట్ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే .. అందులో ఆరు ఎన్డీయే కూటమి ఈసారి ఏపీలో అధికారంలోకి వస్తోందని స్పష్టం చేయటం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడి పొత్తులతో కలసి కట్టుగా బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి దాదాపు అన్ని సర్వేలూ.. 100కు పైగా సీట్లు వస్తాయని చెప్పాయి.
రైజ్ సంస్థ ఏపీలో ఎన్డీఏ కూటమి 113 -122 సీట్లతో అధికారంలోకి రాబోతుందని అంచనా వేసింది. అలాగే ఎన్డీఏ కూటమికి జనగళం 104-118 సీట్లు, చాణక్య స్ట్రాటజీస్ 114 -125, పయనీర్ 144, పీపుల్స్ పల్స్ 111-135, కేకే సర్వేస్ రికార్డ్ స్థాయిలో 161 స్థానాలు దక్కబోతున్నాయని అంచనా వేశాయి. ఆరా సంస్థ మాత్రం 71-81 సీట్లతో ఎన్డీఏ కూటమి ప్రతిపక్షానికి పరిమితమవుతుందని వెల్లడించింది. ఏపీకి సంబంధించి దాదాపు 40 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా.. అందులో 35 వరకు ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. ఆరా తోపాటు పార్థచైతన్య, ఆత్మసాక్షి, ఆపరేషన్ చాణక్య, అగ్నివీర్ వంటి మిగిలిన సంస్థలు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపాయి. వైసీపీ 94 నుంచి 128 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయా సంస్థలు జోస్యం చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఏపీలో బెట్టింగ్ బాబుల హడావుడి పెరిగిపోయింది.