Jagan Record in AP Elections(Political news in AP): మూడు ముక్కలాట వద్దు.. అభివృద్దే కావాలంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఏ వర్గాలైతే తమకు బలమైన ఓటు బ్యాంకని వైసీపీ ధీమాకు పోయిందో వారు కూడా ఆ పార్టీని చావుదెబ్బ కొట్టారు. వై నాట్ వన్ సెవెన్టీ ఫైవ్ అని ఓవర్ యాక్షన్ చేసిన జగన్ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు. అధికారంతో పాటు విపక్ష హోదా కూడా లేకుండా చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సృష్టించిన ప్రభంజనానికి ఫ్యాను రెక్కలు విరిగి పడ్డాయి. పోలింగ్ తర్వాత కూడా చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్.. అత్యంత ఘోరమైన ఓటమి చవిచూసిన పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయారు.
మే 6న జగన్ నోటి వెంట వచ్చిన మాటలు ఏమయ్యాయో. అప్పుడే వైసీపీ అధ్యక్షుడు జగన్ మఖం మీద నవ్వు మాయమైంది. ప్రసంగాల్లో పదాలు తేడా కొట్టాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని.. అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని తెగ ఫీలైపోయారు. సీన్ కట్ చేస్తే.. గత నెల 13న పోలింగ్ ముగిసింది. తనకు పెయిడ్ సలహాలు ఇచ్చి గైడ్ చేసిన ఐ ప్యాక్ టీంని అభినందించడానికి వెళ్లిన జగన్.. ఆ టీంతో సెల్ఫీలు దిగి.. 2019కి మించి చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా ఇంగ్లీషులో ప్రకటించారు.
ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అని బేలగా వ్యాఖ్యనించిన జగన్ ముఖంలో కనిపించిన ఫీలింగ్సే.. చరిత్ర సృష్టిస్తామని చెప్పినప్పుడు కూడా కనిపించాయి. ముఖంలో ఎలాంటి ధీమా కనిపించకపోయినా మాటల్లో మాత్రం గాంభీర్యం ప్రదర్శించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కచెల్లెమ్మల ఓట్లు, అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు.
Also Read : జనసేనకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పార్టీ పర్మినెంట్ గుర్తుగా ‘గాజు గ్లాసు’?
ఐదేళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైసీపీని అధికారం పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడా పార్టీని అథఃపాతాళానికి తొక్కేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవినీ ఎరగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. వైనాట్ 175 అని రాగాలు పలికిన జగన్ పార్టీ.. 11 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదంటే ప్రజలు జగన్ పాలనపై ఎంతో ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుంది.
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా కాంగ్రెస్ అంత దయనీయంగా ఓడిపోలేదు. అప్పుడు 60 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 1989లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా 74 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2004లో సైతం టీడీపీ 47 స్థానాలతో ప్రతిపక్ష హోదాను కాపాడుకుంది. ఆఖరికి గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
అయితే ఈ సారి మాత్రం రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా వైసీపీని చావు దెబ్బకొట్టారు ఓటర్లు.. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో సీట్లు సాధించి చరిత్ర సృష్టించాయి. పోలింగ్ తర్వాత చరిత్ర సృష్టిస్తామని చెప్పిన జగన్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా.. సరికొత్త చరిత్ర సృష్టించారు. పాలకుడు ఎలా ఉండకూడదో అన్న దానికి ఒక కేస్ స్టడీగా నిలిచారని విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చేయకపోయినా.. ఆడుదాం ఆంధ్రా.. అని తెగ హడావుడి చేసింది జగన్ టీం.. ఇప్పుడు సరిగ్గా పదకొండు మందితో ఆ టీం మిగిలింది. మొత్తానికి మాజీ సీఎం అలా రికార్డు సృష్టించి.. చరిత్ర తిరగరాశారన్న మాట.