YSRCP vs TDP: వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ రోల్ కొన్నాళ్లు బొత్స పొషిస్తున్నారా? ఏదో విధంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అధినేత జగన్ లండన్ వెళ్ళేముందు కీలక నేతలకు ఏం చెప్పారు? తనకు ప్రాణహాని ఉందని బొత్స విమర్శలు గుప్పించడం వెనుక జగన్ ప్లాన్ ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కూటమిపై వైసీపీ విమర్శల వర్షం
కూటమి సర్కార్‌పై రకరకాల ఆరోపణలు చేస్తోంది వైసీపీ. రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం శనివారం వేకువజామున లండన్‌కు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. అంతకుముందు నేతలకు కీలక సూచనలు అధినేత చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఈ క్రమంలో మండలి విపక్ష నేత శనివారం మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయనగరం పట్టణంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల్లో బొత్స సత్యనారాయణ కూర్చొన్న స్టేజ్ ఒక్కసారిగా కూలిపోయింది. కేవలం 20 మంది సరిపడినట్టుగా ఆ స్టేజ్‌ని నిర్మించారట. కాకపోతే దాదాపు 50 మంది వరకు నేతలు స్టేజ్‌పైకి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అందరూ సేఫ్‌గా బయటపడ్డారు. సొంత జిల్లాలో అమ్మవారి పండుగకు ఈ విధంగా జరగడం బొత్స తట్టుకోలేకపోయారట.
జగన్ స్కెచ్‌లో భాగమేనా బొత్స వ్యాఖ్యలు
ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కొత్త స్కెచ్ వేసినట్టు టీడీపీ నేతల మాట. ఈ క్రమంలో తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు మండలి ప్రతిపక్ష నేత బొత్స. దీనిపై గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు లేఖ రాస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ బొత్స అంటే తమకు గౌరవం ఉందన్నారు ఏపీ టీడీపీ చీఫ్.
కూటమి పార్టీల వల్ల ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు పల్లా శ్రీనివాస్. బొత్సకు ఉంటే జగన్ వల్ల ప్రాణహాని ఉందన్నారు. ఇటీవలకాలంలో మాజీ సీఎం జగన్ కంటే.. మండలిలో బొత్స సత్యనారాయణ ఫోకస్ అవుతున్నారని, ఈ క్రమంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు. కూలిన వేదికను పార్టీ జెండాలతో ఏర్పాటు చేసింది బొత్స అనుచరులేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ALSO READ: ఏపీలో తొలి ఐఏ ఎడ్జ్ డేటా సెంటర్.. మంత్రి లోకేష్ శంకుస్థాపన
వర్షానికి తోడు ఎక్కువమంది స్టేజ్‌పైకి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలిందన్నారు. బొత్స వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడిపోవడంతో సైలెంట్ అయిపోయారు వైసీపీ నేతలు. బొత్స వ్యాఖ్యలకు మద్దతుగా ఆ పార్టీ నుంచి నేతలు నోరు విప్పలేదు. మొత్తానికి బొత్స వ్యాఖ్యల వెనుక ఆ పార్టీలో ఏదో జరుగుతున్నట్లు చర్చించుకుంటున్నారు.
నిత్యం ఏదోవిధంగా కూటమిపై విమర్శలు గుప్పించాలంటూ అధిష్టానం నుంచి కీలక నేతలకు సంకేతాలు వెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బొత్స ఆ తరహా కామెంట్స్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్, 23న తిరిగి తాడేపల్లికి రానున్నారు. అప్పటివరకు కూటమి ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారో చూడాలి.