Hasanamba temple: కర్ణాటక రాష్ట్రంలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా దేవాలయం విశ్వాసం, భక్తి సమ్మేళనం. ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ప్రతి రోజూ భక్తులతో కిటకిటలాడుతుంటే ఈ ఆలయం మాత్రం సంవత్సరానికి ఒక్కసారే తెరుచుకుంటుంది. అదే దీపావళి పండుగ సమయం. ఈ ఒక్క వారం రోజుల సమయంలో లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి తరలివస్తారు.
హసనాంబా దేవాలయ చరిత్ర
హసనాంబా అమ్మవారు అనేది అంబా దేవి అవతారం అని చెబుతారు. ఈ దేవి సప్తమాతృకల్లో ఒకరని కూడా స్థానికులు నమ్ముతారు. “హసన్” అనే పట్టణానికి పేరుకూడా “హసనాంబా” నుండి వచ్చిందని చెబుతుంటారు స్థానికులు. హసనాంబా అంటే నవ్వే తల్లి అనే అర్థం. ఎందుకంటే అమ్మవారు ఎల్లప్పుడూ చిరునవ్వుతో భక్తులను ఆశీర్వదిస్తుందని నమ్మకం.
ఆలయం గురించి చరిత్ర ఏం చెబుతుంది?
ఈ దేవాలయం చరిత్ర ప్రకారం, 12వ శతాబ్దంలో నిర్మించబడిందని కొందరు పురావస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే, దీని వాస్తవ మూలాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం, శిల్ప కళ, పాత కాలపు రాతి విగ్రహాలు ఈ ఆలయానికి ఒక చరిత్రను చెబుతుంటాయి.
దీపావళి రోజునే ఎందుకు తెరుస్తారు?
హసనాంబా దేవాలయం తలుపులు సంవత్సరానికి ఒక్కసారి, దీపావళి రోజునే తెరుస్తారు. దీని వెనుక ఒక ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి సమయానికి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, ఆ తర్వాత మళ్లీ తన యోగనిద్రలోకి వెళ్లిపోతారని చెబుతారు.
Also Read: Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!
దీపావళి ముందు రోజు ఆలయం తలుపులు తెరిచిన వెంటనే, భక్తులు భారీగా క్యూలలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సమయం మొత్తం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, హోమాలు నిర్వహిస్తారు. అలా భక్తులతో పూజలు అందుకున్న అమ్మవారు ఆతరువాత యోగనిద్రలోకి వెళతారని చరిత్ర.
ఏడాది పాటు ఆరని దీపం
ఇక్కడి మరో ఆశ్చర్యం ఏంటంటే ఆలయ తలుపులు మూసిన తర్వాత కూడా గర్భగుడిలో వెలిగించిన దీపం ఏడాది పొడవునా ఆరిపోదు. దీపం వెలుగు తగ్గకుండా ఉండటం ఆ అమ్మవారి శక్తి అని, అది దైవీ శక్తి రూపమని భక్తులు నమ్ముతారు.
ఇక్కడి మరో మిస్టరీ
అంతేకాదు, తలుపులు మూసే ముందు అమ్మవారికి సమర్పించిన పూలు, నైవేద్యం ఏడాది తర్వాత కూడా చెడిపోకుండా అదే రీతిగా తాజాగా ఉండడం ఇక్కడి మరో మిస్టరీగా చెప్పుకుంటారు. శాస్త్రపరంగా దీని వెనుక కారణం ఏమిటో ఎవరికీ ఇప్పటి వరకు ఖచ్చితంగా తెలియదు. కానీ భక్తులు మాత్రం ఇది అమ్మవారి మహిమ అని నమ్ముతారు.
భక్తుల విశ్వాసం
హసనాంబా అమ్మవారిని దర్శించడం చాలా అదృష్టం అని భావిస్తారు. సంవత్సరానికి ఒక్కసారే దర్శనం కలిగే కారణంగా, ఆ సమయంలో హసన్ పట్టణం మొత్తం పండుగ వాతావరణంతో ముస్తాబవుతుంది. లక్షలాది మంది భక్తులు ఆలయం చుట్టూ క్యాంపులు వేసి ఉంటారు. వీరందరూ అమ్మవారి దర్శనంతో తమ జీవితం మారుతుందని, కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో ఇక్కడకు చేరుకుంటారు. హసనాంబా అమ్మవారికి కొబ్బరికాయలు, పూలు, దీపాలు సమర్పించడం చాలా పవిత్రమైనదని స్థానికులు చెబుతారు.
ఆలయ తలుపులు మూసిన తర్వాత
దీపావళి పండుగ ముగిసిన తర్వాత, ఆలయ తలుపులు మళ్లీ వచ్చే దీపావళి వరకు మూసి వేస్తారు. ఆ సమయంలో ఎవరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. ఈ సమయంలో ఆలయంలో ఎటువంటి ఆచారాలు జరగవు. కానీ బయట పగటి పూట భక్తులు తలుపుల వద్ద దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి మెక్కులు తీర్చుకుంటారు. అమ్మవారికి భక్తులకు కోరికలు తీర్చే శక్తి ఉన్నదనే విశ్వాసం..
ప్రతి దీపావళి సందర్భంగా ఆ దేవాలయం తెరుచుకోవడం అంటే… భక్తుల హృదయాల్లో వెలుగులు వెలిగే క్షణం. హసనాంబా అమ్మవారి దర్శనం పొందడం జీవితంలో ఒకసారి అయినా జరగాలి అని భక్తులు చెబుతారు. ఎందుకంటే ఆమె నవ్వు వెనుక దాగి ఉన్న శక్తి భక్తులను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తుందని విశ్వాసం.