అసలు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెజార్టీపై కుప్పంలో జోరుగా పందాలు సాగుతున్నాయి. అమెరికా నుంచి అనంతపురం వరకు సీబీఎన్ మెజార్టీపై బెట్టింగులు నడుస్తున్నాయట. గత ఎన్నికలలో జరిగిన అనుభవాలతో చంద్రబాబు ఈసారి రెండు సంవత్సరాల ముందు నుంచి కుప్పంపై ఫోకస్ పెట్టారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలలో అవగాహన కల్పిస్తూ సీనియర్ నాయకులను పక్కన బెట్టి యువకులకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌కు అప్పగించారు.
శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించినప్పటికి అటు నారా భువనేశ్వరి సైతం కుప్పం నియోజకవర్గ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. తన సొంతదైన హెరిటేజ్ టీంతో పరిస్థితిని సమీక్షించారు. పలు మార్లు చంద్రబాబుతో పాటు అమె కుప్పం పర్యటనలు చేస్తూ స్థానికులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దాంతో పాటు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు, పిఇఎస్ మెడికల్ కాలేజి ఏర్పాటు.. ఎన్టీఆర్ ట్రస్టు సహాకారంతో నియోజకవర్గంవ్యాప్తంగా మెడికల్ క్యాంపులు విస్తృతంగా నిర్వహించారు. ముఖ్యంగా మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇప్పించి వారికి మరింత దగ్గరయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఆమె .. క్యాడర్‌తో పాటు ప్రజలతో మమేకం అవ్వడం ఈ సారి పార్టీకి బాగా ప్లస్ అయిందంటున్నారు.
Also Read: అద్దంకి ఎవరి కైవసం? గొట్టిపాటికి ఈసారి వైసీపీ చెక్ పెడుతుందా..
అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుప్పం మాజీ ఎమ్మెల్యే దొరస్వామినాయుడు కూమారుడు డాక్టర్ సురేష్ టీడీపీలో చేరడం.. అయనకు పార్టీపరంగా సముచిత ప్రాధాన్యత ఇవ్వడం కూడా టీడీపీకి కలసి వచ్చింది. ఇక లోకేష్ యువగళం పాదయాత్ర కూడా కుప్పం నుంచి ప్రారంభం కావడం కూడా ప్లస్ అయ్యిందంటున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. దాంతో పాటు జగన్ మూడు సార్లు కుప్పంలో పర్యటించారు.
వైనాట్ 175 అనే స్లోగన్ కూడా కుప్పం నుంచే మొదలు పెట్టారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో గెలుపుతో చాలామందిని తమ పార్టీలో చేర్చుకున్నారు. అలా టీడీపీలో లబ్ధి పొందిన వారు కూడా కండువా మార్చి వైసీపీ హయాంలో కూడా పవర్ ఎంజాయ్ చేసారు. ఆ క్రమంలో వైసీపీలో ముందు నుంచి ఉన్న వారు పలువురు సైలెంట్ అయ్యారు. పేరుకి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ భరత్ అయినప్పటికీ మొత్తం వ్యవహారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపించడంతో .. పార్టీ సీనియర్లు భరత్‌ను పెద్దగాపట్టించుకోలేదు.
నియోజకవర్గంలోని గుడిపల్లి, శాంతిపురం , రామకుప్పం,కుప్పం మండలాలతో పాటు కుప్పం మున్సిపాలిటిలో తమకు తిరుగులేదని వైసీపీ భావించింది.. . స్థానికి సంస్థల ఎన్నికల ఫలితాలతో అతి ధీమాకు పోయినట్లు కనిపించింది .. అయితే చంద్రబాబుపై కుప్పం నియోజకవర్గ వాసులకు వ్యక్తిగతంగా నమ్మకం ఉండటంతో పాటు.. మారుమూల కుప్పం అభివృద్ది అక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన చంద్రబాబు వల్లే సాధ్యమైందన్న అభిప్రాయం ఉంది .. ఇక చంద్రబాబు కుప్పం వాసులు సొంతంగా అర్థికంగా ఎదడానికి సహాకరించారన్న మౌత్ పబ్లిసిటీ టీడీపీకి ఇంకా ప్లస్ అయిందంటున్నారు. ఇటు చూస్తే గత అయిదేళ్లలో కుప్పంలో ఒక అభివృద్ది పని కూడా చేపట్టకపోవడం వైసీపీకి మైనస్‌గా మారిందంటున్నారు.
కుప్పంలో ఈసారి 89.88 శాతం పోలింగ్ జరిగింది. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ పోలింగ్ జరగలేదు… గత ఎన్నికల్లో 85.15 శాతం పోలింగ్ నమోదైంది .. 2019లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి యాంటీ వేవ్ వీచినప్పటికీ .. కుప్పంలో మాత్రం చంద్రబాబు 30 వేల 722 ఓట్ల మెజార్టీ సాధించారు. అంతకు సాధించిన ఆధిక్యతల కంటే అది తక్కువే అయినప్పటికీ అంత యాంటీవేవ్‌లోనూ ఆయన కుప్పం నుంచి వరుసగా ఏడో సారి గెలిచి చరిత్ర సృష్టించారు. ఈ సారి పోలింగ్ శాతం మరింత పెరిగింది .. దాదాపు 24 వేల పైచిలుకు ఓట్లు ఎక్కువ నమోదయ్యాయి.
Also Read: ఏపీ సీఎంని డిసైడ్ చేసే ఉరవకొండలో గెలుపెవరిదంటే..
ఆ క్రమంలో తమ పోల్ మేనేజ్‌మెంట్ సక్సెస్ అయిందని.. పోలింగ్ శాతం తమ లక్ష్యానికి దగ్గరగా ఉందని అంటున్నారు టీడీసీనేతలు.. మరో వైపు వైసీపీ వారు కూడా ఖచ్చితంగా తమ లక్ష్యాన్ని సాధిస్తామని అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో జరిగిన హింస, బయట వ్యక్తులు వచ్చి దాడి చేయడం, చంద్రబాబు పర్యటనల సందర్భంగా రాళ్ల దాడులు, నామినేషన్ టైంలో భువనేశ్వరి కాన్యాయ్‌ని దూరంగా ఆపి వేయడం లాంటి ఘటనలతో పాటు.. చంద్రబాబు అరెస్ట్ టీడీపీ క్యాడర్‌లో కసిని పెంచడంతో పాటు.. ఓటర్లలో సానుభూతి పెంచిందంటున్నారు విశ్లేషకులు.
వైసీపీ ప్రభుత్వం కుప్పం రైతులకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వక పోవడంతో పాటు హంద్రీ కాలువ నీళ్ల పేరుతో చేసిన హాడావుడి విమర్శలపాలైంది. అదీకాక లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ ఓట్ల కొనుగోలుకు నోట్లు కూడా భారీగానే వెదజల్లింది. ఈ సారికూడా అదే స్థాయిలో ఆశించిన ఓటర్లకు నిరాశే మిగిలిందంటున్నారు. ముందు ఓక అమౌంట్ చెప్పి అందులో సగమే ఇచ్చారని.. అది కూడా వారు ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే పంపిణీ చేశారని పోలింగ్‌రోజే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఈ సారి కుప్పంలో చంద్రబాబు రికార్డ్ మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు. చంద్రబాబు మెజార్టీ మీదే చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి భవితవ్యం అధారపడి ఉంటుంది. ఏదైతేనేం బాబు మెజార్టీపై బెట్టింగులు మాత్రం కోట్లలో నడుస్తున్నాయి.