Kannappa Movie Release Date: మంచు విష్ణు(Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప(Kannappa). అయితే ఈ సినిమా ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో తెలియదు కానీ ఈ సినిమాపై పూర్తి స్థాయిలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చాలామంది బడా హీరోలు, హీరోయిన్లు భాగమయ్యారు. ఇక వీరికి సంబంధించిన లుక్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తుండగా.. ఆ లుక్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తన సినిమాను కాపాడుకోవడానికి మంచు విష్ణు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ‘మహాదేవ శాస్త్రీ’ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ఆయన లుక్ ను కూడా రివీల్ చేశారు.
కన్నప్ప రిలీజ్ డేట్ లాక్..
ఇకపోతే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని పోస్టర్తో సహా ప్రకటించారు మంచు విష్ణు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ‘ఏప్రిల్ 25వ’ తేదీన కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. “ముక్కంటి.. ఆ మహా పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకోవడానికి సిద్ధం కండి” అంటూ మంచు విష్ణు తెలిపారు. మొత్తానికైతే ఏడాది డిసెంబర్లో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు కానీ వచ్చే యేడాది ఏప్రిల్ కి సినిమాను
వాయిదా వేస్తూ విడుదల తేదీని ప్రకటించారు.
భక్తకన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా..
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తీ గా తీసుకొని కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహాభారత సీరీస్ ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar Singh) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తూ ఉండగా.. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ఇందులో అతిధి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయన పక్కన సతీమణిగా నయనతార (Nayanthara)నటిస్తున్నట్లు సమాచారం. ఇక వీరితోపాటు మధుబాల , ప్రీతి ముకుందన్, శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మంచు విష్ణు గారాలపట్టి ‘అవ్రామ్’ కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇందులో ‘బాల తిన్నడు’ అనే పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారిలో చాలామంది భారీ సక్సెస్ అందుకున్నారు. ‘శకుంతలం’ సినిమాలో కూడా బాల భరతుడి క్యారెక్టర్ లో అల్లు అర్జున్(Allu Arjun) కూతురు అల్లు అర్హ (Allu Arha) నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బాల తిన్నడు క్యారెక్టర్ లో మంచు విష్ణు కొడుకు నటించబోతున్నారు. మరి ఈ అబ్బాయి తన టాలెంట్ తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
మంచు విష్ణు కెరియర్..
ఇంక మంచు విష్ణు విషయానికి వస్తే.. నటుడిగా, నిర్మాతగా పేరు దక్కించుకున్నారు. తన తండ్రి మంచు మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు సీఈవోగా కూడా పనిచేస్తున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం కూడా వహించారు.1985లో రగిలే గుండెలు అనే సినిమాతో బాల నటుడిగా అరంగేట్రం చేసిన విష్ణు 2003లో విష్ణు సినిమాతో హీరోగా పరిచయమై, 2007లో వచ్చిన ఢీ సినిమాతో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.