Gaza: ఆకలి. ఇది మానవ జీవితంలో అత్యంత భయంకరమైన యాతన. దీనికి సమయం సందర్భం ఉండదు. ఆకలికి దేశాలు, మతాలు, రాజకీయాలు ఎటువంటి అడ్డురావు. ఆకలి వేస్తుందంటే అక్కడ మానవత్వం కూడా నిలవదు. నమ్మడం కష్టం అనిపిస్తే.. గాజాలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూస్తే చాలు.
ఇక్కడ రోజు ఊహించని దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ట్రక్కు – అందులో కొంత మందికి మాత్రమే తిండి ఉంది. ఆ ట్రక్కు గాజాలో ప్రవేశిస్తే చాలు ఒక్క క్షణంలో జనాలు చుట్టూ గుంపులుగా దాని వెనుక పరుగులు పెడతారు. ఎవరికి ఏమి దొరుకుతుందో తెలియదు. కాని అందరి లక్ష్యం ఒక్కటే.. ముందుగా ఆ ఆహారం తీసుకోవాలి. అవసరం ఉందో లేదో తరువాత సంగతి. ఈ క్షణంలో ఆకలి తగ్గించడమే లక్ష్యం. ఇలాంటి దృశ్యంలో నాన్న, తల్లి, అన్న, చెల్లి, ఓ తమ్ముడు ఉన్నారు. తినడానికి ఏదైనా తీసుకెళ్లాలని వాళ్ల మనసులో మాట. వాళ్ల కళ్ల ముందు మరో ఆకలి చావు జరగకూడదనేదే వారి ఆతృత.
కాని ఈ పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది?
ఇజ్రాయెల్ దాని వాదన ఏమిటంటే. “మేము ఎయిడ్ ట్రక్కులు పంపిస్తున్నాం. కాని హమాస్ ప్రజలకు వాటిని అందనివ్వడం లేదు,” అంటోంది. దీనికి తాము చూపిన వీడియోలు కూడా ఉన్నాయి. వాటిలో తుపాకులు పట్టుకున్నవారు ట్రక్కుల దగ్గర గుంపును అడ్డుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఇది చాలు అనిపించదా? కానీ హమాస్ కూడా వెనుకాడడం లేదు. వాళ్లు చెబుతున్నారు – “ఇజ్రాయెల్ కావాలనే ఫుడ్ ట్రక్స్‌ని ఆపుతోంది. ఆకలిని ఆయుధంగా మారుస్తోంది. ప్రజలను తిండికోసం వెతుక్కునే విధంగా చేస్తోందని అంటున్నారు. వండటానికి సామాగ్రి లేదు. వంట చేసేందుకు స్థలం కూడా లేదు. పిల్లలకు గుడ్డు, పండు అనేవి కలలో కూడా తెలియని స్థితి. ఇదే నిజం అంటోంది హమాస్.
మరి కొందరి వాదన ఏమిటంటే.. ఇది కావాలనే పథకం ప్రకారం తీసిన వీడియోలు అని. ట్రక్కులను జనాల మధ్య ఉంచి వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి, ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమంటున్నారు. ఇజ్రాయెల్, అమెరికాలను చెడుగా చూపేందుకు ప్రజల బాధను మీడియా ఆయుధంగా వాడుతున్నారని మరో ఆరోపణ. కాని దీనిలో ఎంత నిజం ఉందో అన్నది పక్కన పెడితే… ఓ నిజం మాత్రం ఎప్పటికీ మారదు. అది ఏమిటంటే గాజాలో ఆకలి ఉంది. గాజాలో చావులు ఉన్నాయి. ఇవి కేవలం ఆహార కొరత వల్లే జరుగుతున్నాయి.
కేవలం అరడజను ట్రక్కులే..
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య ఏమైనా జరుగుతోంది కావచ్చు. ఎవరి తప్పో తేల్చటం కష్టం. కానీ ఈ యుద్ధంలో బలయ్యేది సామాన్యులే. వారు ఏ తప్పూ చేయలేదు. వారు కేవలం బతికేందుకు తిండి కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వందల ట్రక్కులు వెళ్లే గాజాలో, ఇప్పుడు కేవలం అరడజను ట్రక్కులే వెళ్లుతున్నాయి. వాటి చుట్టూ గుంపులు గుంపులుగా చేరే ప్రజలలో హడావుడి, అలజడి ఇవన్నీ ఆకలి రూపాల్లో వ్యక్తమవుతున్న మానవ సమూహం.
ఈ పరస్పర ఆరోపణల మధ్య ఓ నిజం మరుగున పడకూడదు. గత కొన్ని నెలలుగా అలాంటి ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటల్లో చనిపోయిన వారి సంఖ్య 600కి చేరింది. ఇది అధికారిక లెక్క. అసలు ఇది ఎంత వరకూ సాగుతుందో ఎవరికీ తెలియదు.గాజాలో ఆకలి ఓ వ్యాధిగా మారిపోయింది. అది ఆర్థిక వ్యవస్థను కాదు, ఒకవేళ మానవత్వాన్ని కూడా చీల్చేస్తోంది. తిండిలేక, దాహంతో, పని లేక, విద్య లేక, విషాదంతో పెరుగుతున్న గాజా చిన్నారుల కళ్ళలో మనం మనల్ని చూస్తే బాగుంటుంది. ఎందుకంటే… ఒకసారి ఆకలి మన వాతావరణంలోకి ప్రవేశిస్తే… మానవత్వాన్ని మట్టిలో కలిపేదాకా ఆగదు.