Saif Ali Khan : బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పై జరిగిన దాడి బాలీవుడ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఒక సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి, ఏకంగా స్టార్ హీరో సైఫ్ పై కత్తితో తెగబడిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉండగా, యూపీఐ పేమెంట్ నిందితుడిని పట్టించినట్టుగా తెలుస్తోంది.
కీలకంగా మారిన యూపీఐ పేమెంట్
ఇప్పటికే సైఫ్ (Saif Ali Khan) పై దాడి జరిగిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ అనంతరం మీడియా సమావేశంలో దాడి ఎలా జరిగింది అనే విషయాన్ని వివరించారు. ఇక పోలీసుల విచారణలో మహమ్మద్ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. నిందితుడు మహమ్మద్ దొంగతనం చేయాలనే ఆలోచనతోనే సైఫ్ ఇంట్లోకి వెళ్లాడని క్లారిటీ ఇచ్చారు. అతనికి అది సెలబ్రిటీ నివాసం అనే విషయం తెలియకుండానే అక్కడికి వెళ్ళాడని, దాడి అనంతరం వచ్చిన వార్తలను చూసి అసలు విషయాన్ని తెలుసుకున్నాడని విచారణలో పోలీసులు కనుగొన్నారు.
అతడిని పట్టుకునే క్రమంలో బాంద్రా పట్వర్ధన్ గార్డెన్ లోని బస్ స్టాప్ లో ఉదయం 7 గంటల వరకు నిద్రపోయిన అతను లోకల్ ట్రైన్ లో సెంట్రల్ ముంబైలోని వర్లికి ప్రయాణించినట్టు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్నారు.
అయితే సైఫ్ (Saif Ali Khan) పై దాడి ఘటనలో పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. ఏకంగా 300 మంది పోలీసులు ఈ గాలింపు చర్యలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను అధికారులు నిందితుడిని పట్టుకోవడం కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక దాడి తర్వాత అతను బైక్ పై అంధేరి ప్రాంతంలో ప్రయాణించడంతో, ఆ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉంటున్న ప్రాంతాన్ని కనిపెట్టారు. అతడితో పాటే ఆ గదిలో నివాసం ఉంటున్న నలుగురు వ్యక్తుల నుంచి తీసుకున్న సమాచారం నిందితుడిని పట్టుకోవడానికి కొంతవరకు హెల్ప్ అయ్యింది.
ఓ షాప్ లో పరోటా, వాటర్ బాటిల్ కొని, యూపీఐ పేమెంట్ చేయడంతో దొరికిపోయాడు నిందితుడు. ఆ యూపీఐ పేమెంట్ ఆధారంగా అతని నెంబర్ తెలుసుకున్న పోలీసులు, లొకేషన్ ను ట్రేస్ చేసి ఈజీగా మహమ్మద్ ని అదుపులోకి తీసుకోగలిగారు. కానీ పోలీసులను చూడగానే పారిపోవాలని ప్రయత్నించినప్పటికీ, మహమ్మద్ ప్రయత్నం ఫలించలేదు. మొత్తానికి పోలీసులు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి పట్టుకున్నారు.
సైఫ్ పై దాడి సీన్ రీ క్రియేట్…
ఈ నేపథ్యంలోనే బాంద్రా కోర్టు 5 రోజుల్లో గా ఈ ఘటనపై నివేదికను అందించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే మహమ్మద్ అనే ఈ నిందితుడిని పోలీసులు ఇప్పటికే విచారించి, పలు కీలక విషయాలను రాబట్టారు. విచారణలో భాగంగా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న మహమ్మద్ ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి, క్రైమ్ సీన్ రీ క్రియేట్ చేయబోతున్నట్టు సమాచారం.