HBD Mahesh Babu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు (Maheshbabu). ఇక ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడంతో యావత్ ప్రపంచవ్యాప్త అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గత వారం నుంచే ఆయన పుట్టినరోజును ఎలా చేయాలి అని అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ ప్లాన్లు అన్నింటిని ఈరోజు అమలు చేయబోతున్నారు. అంతేకాదు ఈరోజు ఆయనకు సంబంధించిన పలు విషయాలను, ఆయన సాధించిన రికార్డులను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సాధించిన ఒక రికార్డు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది తెలుగు హీరోలలో ఎవరికి సాధ్యం కాలేదని తెలిసి అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఘనత అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరో మహేష్ బాబు..
మహేష్ బాబు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక అరుదైన ఘనతను అందుకున్నారు. అదేంటంటే నటనతో పాటు ఇతర రంగాలలో కూడా అందరికంటే ముందున్నారు మహేష్ బాబు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ చేయడంలో కూడా ముందున్నారు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు నిర్మాణ వ్యవహారాలు, వ్యాపారాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈయన తెలుగులో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తెలుగు సినిమాలలో మాత్రమే చేస్తానని తిరస్కరిస్తూ రీమేక్ లు చేయని హీరోగా రికార్డు సృష్టించారు.
28 చిత్రాలకే 8 నంది అవార్డులు..
మహేష్ బాబు ఇప్పటివరకు 28 చిత్రాలలో నటించగా.. ఆ 28 చిత్రాలతో ఏకంగా 8 నంది అవార్డులు అందుకున్నారు. ‘రాజకుమారుడు’ సినిమాతో తొలిసారి ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్న మహేష్ బాబు.. నిజం, అతడు, శ్రీమంతుడు, దూకుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్ వంటి చిత్రాలతో కూడా నంది అవార్డులు అందుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలు..
1975 ఆగస్టు 9న సూపర్ స్టార్ కృష్ణ (Krishna), ఇందిరా దేవి (Indira Devi) దంపతులకు జన్మించారు. తన నాల్గవ ఏటే దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ అనే చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తండ్రి కృష్ణతో పలు చిత్రాలలో లీడ్ రోల్ పోషించిన ఈయన ‘రాజకుమారుడు’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకుడిగా వ్యవహరించగా.. అశ్వినీ దత్ (Ashwini Dutt) నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు..
మహేష్ బాబు సినిమాలు..
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.