RG Kar Doctor Rape Murder Case Punishment | కోల్‌కతా నగరంలో జరిగిన హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిల్దా కోర్టు కాసేపట్లో శిక్షను ప్రకటించబోతోంది. ఈ తీర్పు వెలువరించే ముందు, న్యాయమూర్తి సంజయ్‌ను “ఏదైనా చెప్పదలచుకున్నావా?” అని అడగనున్నారు. ఆయన సమాధానం విన్న తర్వాత, న్యాయమూర్తి తీర్పు కాపీని చదివి శిక్షను ప్రకటించనున్నారు.
సంచలనం సృష్టించిన హత్యాచారం
2024 ఆగస్టు 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ హత్యాచారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ట్రెయినీ వైద్యురాలిపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన సంఘటనపై వైద్య విద్యార్థులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి, బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసనలు తెలిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా దుఃఖానికి, కోపానికి కారణమైంది.
కేసులో దోషిగా సంజయ్ రాయ్
సంజయ్ రాయ్‌పై భారతీయ న్యాయ సంహితలోని కఠినమైన సెక్షన్లు 64, 66తో పాటు మరణ శిక్ష లేదా జీవిత ఖైదుకు వీలు కల్పించే సెక్షన్ 103(1) కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణను సీల్దా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బణ్ దాస్ ప్రైవేట్‌గా నిర్వహించారు. విచారణ దశలో 50 మంది సాక్షులను విచారణ చేసి, అన్ని ఆధారాలను పరిశీలించి.. రాయ్ దోషిగా తేలినట్లు న్యాయమూర్తి నిర్ధారణ చేశారు.
Also Read: బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే అరుదైన అవకాశం!.. ఎలా దక్కిందంటే?
దోషి చర్యలపై కోర్టు వ్యాఖ్యలు
సిల్దా కోర్టు న్యాయమూర్తి .. సంజయ్ రాయ్‌ని దోషిగా వర్ణిస్తూ తన తీర్పులో.. “నిందితుడు తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆస్పత్రిలోకి చొరబడ్డాడు. సెమినార్ హాల్‌లో నిద్రిస్తున్న ఆన్‌డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడాడు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. సంబంధిత సాక్ష్యాధారాలను పరిశీలించి, వాదనలు విన్న తర్వాత నిందితుడిని దోషిగా తేల్చడం జరిగింది. శిక్షించటం తప్ప మరో మార్గం లేదు,” అని పేర్కొన్నారు.
సీబీఐ చేత విచారణ
కేసు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించింది. సీబీఐ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో అన్ని ఆరోపణలు నిర్ధారితమయ్యాయి. రెండు నెలలపాటు జరిగిన విచారణలో, ఘటనకు సంబంధించిన కీలకమైన ఆధారాలు సేకరించారు.
దోషి కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?
నిందితుడి తల్లి, సోదరి ఇప్పటికే సంజయ్ రాయ్ చేసిన నేరానికి సమర్థించాలని కోరుతూ, “అతను తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించటం తప్పనిసరి,” అని స్పష్టంగా తెలిపారు.
కోర్టు తీర్పు
జనవరి 20, 2025 సోమవారం మధ్యాహ్నం కోర్టు నిందితుడికి శిక్ష ప్రకటించనుంది. దోషికి ఎంతటి శిక్ష విధించబోతోందన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది. ఇది బాధితురాలికి న్యాయం చేకూర్చడంలో కీలకమైన అడుగుగా మారనుంది.