Prabhash.. ప్రభాస్ (Prabhash) .. బాహుబలి (Bahubali ) ముందు వరకు ఒకరు.. బాహుబలి తర్వాత ఇంకొకరు అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. బాహుబలి ముందు వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిచయమైన ప్రభాస్, బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఈ సినిమా తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన సినిమాతో మినిమం గ్యారంటీ అనే నమ్మకాన్ని నిర్మాతలలో కలిగిస్తున్నారు అంటే ప్రభాస్ కి ఏ రేంజ్ లో అభిమానులు వున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒకే నెలలో నాలుగు సినిమాలు..
అందుకే ప్రభాస్ నుంచి కనీసం ఒక్క మూవీ అయిన ఒక ఏడాదిలో రావాలి అని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి ఆడియన్స్ కి నాలుగు సినిమాలు అందులోనూ ఒకే నెలలోనే అంటే ఇక వారు ఉబ్బితబ్బిబ్బైపోతారేమో అని చెప్పవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. అయితే కొత్త సినిమాలు కాదులెండి. ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభాస్ కి చెందిన నాలుగు సినిమాలు, అందులోనూ ఒకే నెలలో రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. దీంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలు..
ఇక అసలు విషయంలోకి వెళ్తే..పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్ పాత హిట్ మూవీస్ అక్టోబర్ నెలలో వరుసగా విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ బర్తడే సెలబ్రేషన్స్ లో భాగంగా అక్టోబర్ మొదటివారం నుంచి ప్రభాస్ సినిమాల హంగామా మొదలు కాబోతోంది.
అక్టోబర్ 2 న చక్రం మూవీ రీ రిలీజ్..
అందులో భాగంగానే కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చిత్రం చక్రం. అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ పెర్ఫార్మన్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని చెప్పవచ్చు. చక్రం సినిమాలోని “జగమంత కుటుంబం నాది” పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ పాట కోసమే అయినా సరే ఎక్కువమంది థియేటర్లలో చూడడానికి ఆసక్తి చూపిస్తారని నిర్మాతలు భావించి, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 22 న మిస్టర్ పర్ఫెక్ట్..
అలాగే దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్ లుక్ కి అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 22వ తేదీన రీ రిలీజ్ కాబోతోంది.
అక్టోబర్ 23 న డార్లింగ్, ఈశ్వర్..
అలాగే ప్రముఖ డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చిత్రం డార్లింగ్. ఈ సినిమా కూడా ప్రభాస్ కి మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీన అంటే ప్రభాస్ పుట్టినరోజు నాడు రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రభాస్ తొలి చిత్రమైన ఈశ్వర్ కూడా అదే రోజు థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రానికి జయంత్ సీ పరాంజి దర్శకత్వం వహించారు. ఇలా అక్టోబర్ లో మొత్తం నాలుగు చిత్రాలు 4k క్వాలిటీతో థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాయి. ఇది కదా ఆడియన్స్ కి అసలైన పండుగ. మొత్తానికైతే ఈ రీ రిలీజ్ చిత్రాలతోనే ప్రభాస్ ఇమేజ్ మరో లెవెల్ అందుకోబోతోందని చెప్పవచ్చు.