Supermarket Explosion: మెక్సిలోని సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. ఆదివారం హెర్మోసిల్లోలోని వాల్డో సూపర్ మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో ఈ ఘటనను ధ్రువీకరించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సంఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు మూడు గంటలపాటు శ్రమించారని అధికారులు తెలిపారు. భవనం శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రత్యేక పరికరాలను వినియోగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోనోరా రాష్ట్ర గవర్నర్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. హెర్మోసిల్లోలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన మనసును కలిచివేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించబడుతుంది. ఈ పేలుడుకు కారణాలను కనుగొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన ట్వీట్ చేశారు.
పేలుడు సమయంలో సూపర్ మార్కెట్‌లో సుమారు 50 మందికి పైగా ఉన్నారని అంచనా. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం కూడా చేరింది. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: విరిగిపడిన కొండ చరియలు.. 21 మంది మృతి
సూపర్ మార్కెట్ భవనంలో గ్యాస్ లైన్ల భద్రతా ప్రమాణాలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవనం మిగిలిన భాగాలను కూల్చివేసే పనులు కూడా కొనసాగుతున్నాయి. అధికారులు స్థానిక ప్రజలను సంఘటన ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు. సమీపంలోని వ్యాపార కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు.