Kenya Landslide: ఆఫ్రికా దేశం కెన్యాలో ప్రకృతి భీభత్సం సృష్టించింది. మారాక్ వెట్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకారణంగా.. కొండచరియలు విరిగిపడి పలు గ్రామాలు మట్టిలో కలసిపోయాయి. ఇళ్లతోపాటు రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. పలువురు గల్లంతయ్యారని సమాచారం.
మారాక్ వెట్ జిల్లాలో పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని కెన్యా అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. ఈ ఘటనలో సుమారు 21 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో రోడ్లు కూడా ధ్వసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మట్టిలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు మొదలుపెట్టింది. వందల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బాధితుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది.
కెన్యాలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈసారి గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాతావరణ మార్పుల ప్రభావంతో తూర్పు ఆఫ్రికా దేశాల్లో వర్షాల ధోరణి పూర్తిగా మారిపోయింది. సాధారణంగా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఇప్పుడు ముంచెత్తుతున్నాయి. దాంతో మట్టిచరియలు, వరదలు తరచుగా సంభవిస్తున్నాయి.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా కెన్యా ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల సహాయాన్ని కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి (UN), రెడ్‌క్రాస్, వరల్డ్ విజన్ సంస్థలు పరిణామాలను గమనిస్తున్నాయి. అవసరమైతే సహాయక బృందాలను పంపేందుకు సిద్ధమని వెల్లడించాయి.
Also Read: న్యూయార్క్ ఎయిర్ పోర్టులో తప్పిన ప్రమాదం.. ఆగివున్న విమానాన్ని ఢీకొన్న మరో విమానం
వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు, వర్షాలు తగ్గే వరకు ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లో ఉండాలని, నదీ తీరాలు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.