ఆయన వయసు 36 ఏళ్లు.
కోమాలో ఉన్న సమయం దాదాపు 20 ఏళ్లు.
అంటే 16 ఏళ్ల వయసులో కోమాలోకి వెళ్లిన ఆయన 36 ఏళ్లు వచ్చే వరకు కోమాలోనే ఉన్నారు. అయినా లాభం లేదు, చివరకు కోమా స్టేజ్ నుంచి బయటపడకుండానే ఆయన కన్నుమూశారు. ఆయనే సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్. నెటిజన్లు ఆయనకు పెట్టిన ముద్దుపేరు స్లీపింగ్ ప్రిన్స్. 20 ఏళ్లు స్లీప్ లోనే ఉన్న ఆప్రిన్స్ ఇప్పుడు చనిపోవడం సంచలనంగా మారింది.
తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన వారు బతికే ఛాన్స్ లు చాలా తక్కువ. కోమాలోకి వెళ్లాడంటే దాదాపు చావుకు దగ్గరయ్యాడనే చెప్పాలి. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి కోమాలో ఉన్న కొందరు బతికి బట్టకట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ మాత్రం తిరిగి ఈ ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూశారు. గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ఆయన మరణాన్ని ధృవీకరించింది. సౌదీ రాజు ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా తన కొడుకు చనిపోయినట్టు ప్రకటించారు.
సౌదీ రాజు ఖలీద్ బిన్ తలాల్ కుమారుల్లో అల్ వలీద్ కూడా ఒకరు. 1990లో జన్మించిన వలీద్ అంటే తండ్రికి విపరీతమైన అభిమానం. ఉన్నత విద్యకోసం కొడుకుని బ్రిటన్ లోని మిలట్రీ కాలేజీలో చేర్పించారు సౌదీ రాజు. అయితే 2005లో జరిగిన ఓ కారు ప్రమాదం అతడిని జీవచ్ఛవంలా మార్చింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన అల్ వలీద్ కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు. ప్రపంచంలోని ప్రముఖ వైద్య నిపుణుల్ని రప్పించి వైద్యం చేయించారు. కానీ ఫలితం లేదు. 2015లోనే అతడి మరణం ఖాయమని వైద్యులు చెప్పారు. కానీ రాజు మాత్రం వెంటిలేటర్ తీయించేందుకు ఇష్టపడలేదు. తన కొడుకు బతుకుతాడని అతడు ఆశపడ్డారు. ఆస్పత్రిలోనే ఎక్కువ కాలం గడిపేవాడు. కొడుకు కళ్లుతెరచి చూస్తాడని ఎదురు చూసేవాడు. కొన్ని కోట్ల రూపాయలు అతడి వైద్యం కోసం ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. తండ్రి 20 ఏళ్ల ఎదురు చూపులు కూడా ఫలించలేదు.
2019లో యువరాజు కోమానుంచి బయటపడ్డాడని అనుకున్నారంతా. చేతివేళ్లు కదిలించే సరికి ఆయన తండ్రి ఆనందానికి పగ్గాలు లేవు. కొడుకు బతికాడని సంబరపడ్డాడు. కానీ చేతివేళ్లు కదిలించిన యువరాజు కోలుకోలేదు. అంతకు మించి మరే అద్భుతం కూడా జరగలేదు. దాదాపు 20 ఏళ్లు కోమాలోనే ఉన్నాడు. ప్రతి ఏడాదీ ఆస్పత్రి బెడ్ పైనే అతడి పుట్టినరోజు వేడుకలు చేసేవారు రాజు. కొడుకు పేరుమీద సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. చివరకు అంతర్గత అవయవాలన్నీ పూర్తిగా చెడిపోయాయి. వెంటిలేటర్ సపోర్ట్ పై కూడా అతడు బతకలేదు. కొడుకు కన్నుమూయడంతో ఆ తండ్రి షాకయ్యాడు. 20 ఏళ్లు బిడ్డ ప్రాణంతో లేచి వస్తాడని ఆశపడ్డ తండ్రి ఆ వార్త విని కుంగిపోయాడు. స్లీపింగ్ ప్రిన్స్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.