Vitamin D: శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్ డిని ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సూర్యరశ్మి ద్వారానే మన శరీరానికి అత్యధికంగా విటమిన్ డి లభిస్తుంది. ఇంతకీ విటమిన్ డి లభించాలంటే సూర్యరశ్మిలో ఏ సమయంలో ఉండాలి ? ఎంతసేపు ఉండాలి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వీటిని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి పొందడానికి సరైన సమయం:
విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్-బి (UVB) కిరణాలు అవసరం. ఈ కిరణాలు ఉదయం, సాయంత్రం సమయంలో అంతగా ఉండవు. సాధారణంగా.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యరశ్మిలో UVB కిరణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎండలో ఉండడం వల్ల శరీరం విటమిన్ డిని సమర్థవంతంగా తయారు చేసుకోగలదు.
ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య: ఈ సమయం విటమిన్ డి పొందడానికి చాలా అనుకూలమైనది. ఎండలో తీవ్రత మరీ ఎక్కువగా ఉండదు. కానీ UVB కిరణాలు తగినంతగా ఉంటాయి.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య: ఈ సమయంలో సూర్యరశ్మి చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల కొద్దిసేపు ఎండలో ఉన్నా విటమిన్ డి త్వరగా లభిస్తుంది. అయితే.. ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం రంగు మారే ప్రమాదం ఉంటుంది.
ఎంత సమయం ఉండాలి ?
విటమిన్ డి పొందడానికి ఎక్కువసేపు ఎండలో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 10 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుంది. చర్మం రంగును బట్టి ఈ సమయం మారుతుంది.
తెల్లటి చర్మం ఉన్నవారు: 10-15 నిమిషాలు సరిపోతుంది.
నల్లటి చర్మం ఉన్నవారు: నల్లటి చర్మం ఉన్న వారిలో మెలనిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎండను ఎక్కువగా గ్రహిస్తుంది. అందుకే 20-30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు.
Also Read: తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి
ఎండలో ఉన్నప్పుడు మీ ముఖం, చేతులు, కాళ్ళు వంటి భాగాలపై నేరుగా సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. ఎక్కువసేపు ఉండాలని భావిస్తే సన్‌స్క్రీన్ వాడటం మంచిది. కానీ, సన్‌స్క్రీన్ విటమిన్ డి ఉత్పత్తిని తగ్గిస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే తక్కువ సమయంలో.. సన్‌స్క్రీన్ లేకుండా ఉండడం మంచిది.
చివరగా.. విటమిన్ డి పొందడానికి రోజూ లేదా వారానికి 2-3 సార్లు కొంత సమయం ఎండలో గడపడం మంచిది. అయితే.. విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంటే మాత్రం కేవలం సూర్యరశ్మి సరిపోదు. ఆ సమయంలో డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.