భారత్ ని ఇబ్బంది పెట్టేలా అమెరికా ఇష్టం వచ్చినట్టు సుంకాలు పెంచుకుంటూ పోతోంది. అడిగేవారు లేరన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. భారత్ పై ట్రంప్ కి ఎందుకంత కక్ష? పైకి తెలుస్తున్న కారణం ఒకటే. రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందం. పోనీ దాన్ని ఉల్లంఘించి అమెరికా చెప్పినట్టు చేస్తే భారత్ కి కలిగే లాభమేంటి? భారత్ చమురు సంక్షోభంలో మునిగిపోవడం మినహా ఇంకేమీ జరగదనేది నిపుణుల హెచ్చరిక. ఈ దశలో భారత్ కూడా దూకుడుగానే ఉండాలని అంటున్నారు. అంటే అమెరికా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్కెట్లను అణ్వేషించాలని చెబుతున్నారు. భారత్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ కు పుతిన్..
రష్యాతో స్నేహం వద్దని భారత్ ని హెచ్చరిస్తున్నారు ట్రంప్. మరి అదే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సమావేశం అయితే ట్రంప్ కి ఏ స్థాయిలో మండుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ మోదీ అదే చేయబోతున్నారు. అయితే ఈ మీటింగ్ ఇప్పుడప్పుడే కాదు. ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ సందర్శనకు రాబోతున్నారని, ఆయన పర్యటన తేదీలు ఖరారవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తాజాగా ప్రకటించడం విశేషం. ప్రస్తుతం దోవల్ రష్యాలోని మాస్కోలో ఉన్నారు. రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో సమావేశమైన దోవల్.. పుతిన్-మోదీ మీటింగ్ పై ప్రకటన చేశారు. అంతేకాదు, ట్రంప్ కి మరింత సెగ తగిలే కామెంట్లు కూడా చేశారు. పుతిన్ రాక కోసం భారత్ ఉత్సాహంగా ఎదుచూస్తోందని చెప్పారు దోవల్. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చేందుకు మంచి మార్గం అన్నారు. భారత్, రష్యా మధ్య చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం ఉన్నాయని, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తాము ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని చెప్పారు దోవల్. గతేడాది భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండుసార్లు కలవడం విశేషం. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లగా.. ఆ తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాధినేతలు కలిశారు.
Kremlin says a Putin-Trump meeting in the coming days has been agreed on, details to follow, reports AP. pic.twitter.com/rp0POcqP8V
— Press Trust of India (@PTI_News) August 7, 2025
ట్రంప్ ఏం చేస్తారు?
ఆల్రడీ ట్రంప్ చేయాల్సిందంతా చేసేశారు. 25 శాతం సుంకాలే మోత అనుకుంటే, దాన్ని 50 శాతానికి పెంచి మరీ తమాషా చూస్తున్నారు. భారత్ ని కంగారు పెట్టి తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అదే సమయంలో మనల్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ కు లేనిపోని హామీలిచ్చేస్తున్నారు. కానీ భారత్ ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. పుతిన్ కి లొంగితే భారత్ సార్వభౌమత్వానికే అది మాయని మచ్చలా మారుతుంది. అయితే భారత్ ఎదురు తిరిగితే ట్రంప్ ఏం చేస్తారనేది ఆసక్తికరం. ట్రంప్ కి మరింత మంట పెట్టేలా భారత్ నిర్ణయాలు తీసుకుంటే అగ్రరాజ్యం దిగిరాక తప్పదనేది నిపుణుల సలహా. అమెరికా మార్కెట్ పై మరింత ఆధారపడకుండా, ప్రత్యామ్నాయం చూసుకుంటేనే భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అంటున్నారు నిపుణులు. అదే జరిగితే అమెరికానే దిగిరాక తప్పదని చెబుతున్నారు.
చైనాతో కూడా..
భారత్ కు రష్యా నమ్మదగిన మిత్రుడు. అయితే చైనా అలా కాదు, చైనాతో మనకు సరిహద్దు గొడవలున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు చైనా ఆయుధ సామగ్రి విషయంలో సహాయం చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అమెరికా టారిఫ్ వార్ కి చైనా కూడా బాధితురాలే. ఉమ్మడి శత్రువు అమెరికా అంతు తేల్చాలంటే చైనా, భారత్ కూడా తప్పక కలవాలి. ఈ దిశగా కూడా భారత్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు చైనా కూడా భారత్ కి అనుకూల సంకేతాలిస్తోంది. అమెరికా టారిఫ్ వార్ పై భారత స్పందనను చైనా సమర్థించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కూడా మోదీ భేటీ అవుతారని తెలుస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా చైనా-భారత్-రష్యా కూటమి కడితే ఇక ట్రంప్ కి దబిడ దిబిడే.