రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై అత్యధిక సుంకాలు విధించానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇతర దేశాల పరిస్థితి ఏంటి? వాటిని ఎందుకు వదిలిపెట్టారు..? రష్యానుంచి చమురు కొంటున్న చైనాపై కూడా ఇంత భారీగా టారిఫ్ లు విధిస్తారా? అనే ప్రశ్నకు ట్రంప్ తెలివిగా సమాధానమిచ్చారు. ముందు ముందు ఇంకా చాలా చూడబోతున్నారని చెప్పారు. అంటే ట్రంప్ మనసులో ఇంకా ఏదో ఉన్నట్టు స్పష్టమవుతోంది. భారత్ పై సుంకాలను బూచిగా చూపిస్తూ ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారు ట్రంప్. అయితే ఇక్కడ భారత్ ఎదురు తిరగడంతో ట్రంప్ పాచిక పారేలా లేదు.
చైనాపై కూడా..
రష్యానుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భారత్ నుంచి వచ్చే ఆదాయంతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోందని ట్రంప్ వితండవాదానికి దిగారు. ఆ యుద్ధానికి భారత్ పరోక్ష కారణం అని, అందుకే సుంకాలను భారీగా పెంచానని తన చర్యల్ని సమర్థించుకున్నారు. అయితే రష్యా నుంచి భారత్ మాత్రమే చమురు దిగుమతి చేసుకోవడం లేదు. ఇతర ప్రపంచ దేశాలు కూడా రష్యాతో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉన్నాయి. వాటన్నిటినీ వదిలి ట్రంప్ మనపైనే పడటం ఇక్కడ విచిత్రం. ఇదే ప్రశ్నను విలేకరులు ఆయనకు సంధించారు. దానికి ఆయన చెప్పిన సమాధానమే ‘వెయిట్ అండ్ సీ’. అంటే చైనా సహా ఇతర దేశాలపై కూడా ట్రంప్ భారీ సుంకాలు విధించబోతున్నారనమాట. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు మాస్కోపై ఒత్తిడి పెంచేందుకు తన చర్యలు ఉపయోగపడుతుందన్నారు ట్రంప్. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా తన రియాక్షన్ ఇలాగే ఉంటుందని, అందులో చైనా కూడా ఉండొచ్చని పరోక్షంగా హింటిచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే..?
ఒకవేళ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే భారత్ పై విధించే సుంకాలను తగ్గించేస్తారా అనే మరో ప్రశ్న కూడా ట్రంప్ కి ఎదురైంది. అయితే దీన్ని కూడా ఆయన దాటవేశారు. ఆ సంగతి తర్వాత చూద్దామన్నారు. ప్రస్తుతానికి భారత్ 50శాతం సుంకాలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ పై ఎక్కడలేని సింపతీ చూపిస్తున్న ట్రంప్, సుంకాల మోత మోగించి భారత్ ని నిలువరించాలని చూడటం హాస్యాస్పదం అంటున్నారు విశ్లేషకులు.
నోబెల్ కోసమేనా..?
మరోవైపు ట్రంప్ ఇదంతా చేస్తోంది నోబెల్ శాంతి బహుమతికోసమేనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు చేపట్టినా అవన్నీ బెడిసికొట్టాయి. చివరకు ఇలా ఇతర దేశాలపై సుంకాలు విధించి, వారిని రష్యాకు దూరం చేసి ఉక్రెయిన్ కి మేలు చేయాలని చూస్తున్నట్టున్నారు. ఏది ఏమైనా చివరకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగితే ఆ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు ట్రంప్. అలా నోబెల్ కి మరో అర్హత సాధించాలనేది ఆయన తాపత్రయం అని సోషల్ మీడియాలో కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు.