China Monkeys : మనిషి అంతరిక్షంలో ఎప్పుడో అడుగు పెట్టాడు. నివాస యోగ్యమైన గ్రహాల కోసం అన్వేషిస్తున్నాడు. నాసాసహా ఎన్నో అంతరిక్ష పరిశోధన సంస్థలు అరుణ గ్రహంపై ప్రయోగాలు సాగిస్తున్నాయి. విశ్వంలోని రహస్యాలను ఛేదించడానికి స్పేస్ స్టేషన్లలో పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిశోధనల్లో ఆరితేరిన చైనా ఇప్పుడు మరో సరికొత్త ఎక్స్ పరిమెంట్ కు రెడీ అవుతోంది. అదేంటంటే భూమికి దూరంగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో సంభోగం, సంతానం సాధ్యమేనా అనేది దాని సారాంశం. ఇందుకోసం డ్రాగన్ కంట్రీ… కోతులను ఎంచుకుంది. ఎలుకలు, కోతులపై ప్రయోగాలు చేయడం కొత్తకాదు. అయితే చైనా తన ప్రయోగానికి వానరాలనే ఎంచుకోడానికి కారణం లేకపోలేదు. వీటికి మనుషులతో సారుప్యత ఎక్కువ. అందుకే కొత్తగా ప్రారంభించిన న్యూతియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి కోతులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం వెల్లడించింది.
గురుత్వాకర్షణ రహిత స్థితిలో పెద్ద జీవుల పునరుత్పత్తి సాధ్యమా? కాదా? అనే విషయాలపై చైనా పరిశోధనలు సాగిస్తుంది. గురుత్వాకర్షణ లేని చోట వానరాల ప్రవర్తనను గమనించనున్నారు సైంటిస్టులు. వాటిలో సంభోగం, గర్భం దాల్చడం వంటివి సాధ్యపడితే… అంతరిక్షంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న మనిషికి కూడా సాధ్యమే అవుతుందని రుజువయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కోతుల ప్రయోగం విఫలమైతే అందుకు కారణాలేంటో తెలుస్తాయి.
అంతరిక్షకేంద్రాల్లో ఇలాంటి ప్రయోగాలు జరగడం ఇదే కొత్తకాదు. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో సోవియట్ సైంటిస్టులు ఎలుకలతో ఇలాంటి ఎక్స్ పరిమెంటే చేశారు. కానీ సక్సెస్ కాలేదు. అంతరిక్ష కేంద్రంలోనే కాదు… అవి భూమిపైకి వచ్చాక కూడా గర్భం దాల్చలేదు. దీనికి కారణాలను అన్వేషించిన సైంటిస్టులు… గురుత్వాకర్షణ రహిత స్థితిలో వాటి పునరుత్పత్తి అవయవాలు దెబ్బతిన్నాయని గ్రహించారు. ఫలితంగా వాటి సెక్స్ హార్మోన్స్ లో వచ్చిన తేడాను గుర్తించారు. తక్కువ రక్తపోటు కారణంగా అంగస్తంభన సమస్యలు ఏర్పడుతాయని గుర్తించారు. మరిప్పుడు కోతుల ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ వానరాలను ఎక్కువసేపు ఎన్ క్లోజర్లలో ఉంచడం సాధ్యమేనా అనేది చైనా శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ప్రశ్న.