Worlds Largest Economy : ఔను. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని చెబుతోంది… ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ. వచ్చే ఏడేళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని… 2027 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. మోర్గాన్ స్టాన్లీ లెక్కల ప్రకారం… భారత జీడీపీ ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి వచ్చే 10 ఏళ్లలో ఏకంగా 8.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇకపై భారత్ జీడీపీకి ఏటా 400 బిలియన్ డాలర్ల జత చేయొచ్చని… ఇప్పటివరకు అమెరికా, చైనాలు మాత్రమే అలా చేశాయని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. 2032 కల్లా భారత మార్కెట్ విలువ 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 11 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.
GST అమలు, కార్పొరేట్ పన్నుల్లో కోత, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా భారత్ భారీగా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని… ఈ చర్యలన్నీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను వేగవంత వృద్ధిని సాధించే దేశంగా తయారు చేస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. జీడీపీ విషయంలో భారత్, చైనా మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉన్నా… పనిచేసే వయసు ఉన్న జనాభా భారత్‌లో పెరుగుతోంది కాబట్టి దీర్ఘకాల వృద్ధి సాధ్యమవుతుందని… చైనాతో పోలిస్తే భారత పౌరుల సగటు వయసు 11 ఏళ్లు తక్కువ కావడం కూడా కలిసొచ్చే అంశమని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది.
భారత్ ఇపుడు మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని… ఆధార్ వంటి ప్రజా డిజిటల్ మౌలిక వసతుల వల్ల వినియోగదారులు, వ్యాపారుల మధ్య లావాదేవీలు సులభంగానే కాక, సురక్షితంగా సాగుతున్నాయని… ఈ సానుకూలత వల్ల వచ్చే 10 ఏళ్లలో అంతర్జాతీయ వృద్ధిలో 5వ వంతు వృద్ధిని భారత్ ఒక్కటే సాధించగలదని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇతర దేశాల్లో వృద్ధి అంతగా కనిపించని పరిస్థితుల్లో… మల్టీనేషనల్ కంపెనీలకు, అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ ఒక గమ్యస్థానంగా మారుతుందని మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది.