అమరావతిలో ఏదో జరిగిపోతోంది, అసలు అమరావతే మునిగిపోతోందంటూ కొన్నిరోజులుగా వైసీపీ మీడియా, వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ ప్రభుత్వం ఖండించినా ఆ వీడియోలు, వార్తలు మాత్రం ఆగలేదు. అదిగదిగో కాల్వకు గండిపడింది, ఇదిగిదిగో వాగు పోటెత్తింది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అమరావతిలోని నిర్మాణాలు నీటమునిగినట్టు కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి ప్రధాన కారణం అని భావిస్తున్న జగన్ కి కూటమి ప్రభుత్వం ఓ సవాల్ విసిరింది. ఆయనకు ధైర్యముంటే అమరావతిలో పర్యటించాలని కోరింది.
జగన్ వస్తారా?
ఇటీవల జగన్ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పలు జైళ్లలో ఉన్న తమ నాయకులను పరామర్శించడానికి కూడా ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వస్తున్నారు. అయితే ఆ పర్యటనలు మానేసి, ఈ పర్యటన మొదలు పెట్టాలని ఆయన్ను కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమా. కుంభకోణాలకు, అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు మానేసి అమరావతి యాత్ర చేయట్టాలని జగన్ కు ఆయన సలహా ఇచ్చారు. అమరావతిలో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కళ్లతో చూడాలని కోరారు.
ఏమేం మునిగాయి..?
వైసీపీ మీడియా ప్రచారం చేస్తున్న వీడియోల్లో దాదాపు రాజధానిలోని అన్ని ప్రాంతాలు నీటమునిగాయని చెబుతున్నారు. అయితే అమరావతిలో ఏ ఒక్క ప్రాంతం కూడా ముంపుబారిన పడలేదని అంటున్నారు టీడీపీ నేతలు. కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్. సచివాలయం, విట్, ఎస్‌ఆర్‌ఎం.. ఇలా జగన్ ఎక్కడికైనా రావొచ్చని, ఏ ప్రాంతం మునిగిందో ఆయన స్వయంగా వచ్చి చూపిస్తే బాగుంటుందని అంటున్నారు. అమరావతి ఎక్కడా మునగలేదని నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు దేవినేని ఉమా.
అందుకేనా..?
అమరావతి మునిగిందంటూ జరుగుతు ప్రచారానికి వేరే కారణం ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఏపీలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని చూసి తట్టుకోలేకే వైసీపీ బ్యాచ్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. స్త్రీ శక్తి పథకానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక దాన్ని డైవర్ట్ చేసేందుకు అమరావతిపై జగన్ విషప్రచారం మొదలుపెట్టారని అంటున్నారు. జగన్ కి ఉన్న మానసిక రుగ్మత అదేనంటూ ఎద్దేవా చేస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు సూపర్ హిట్ గా సాగిపోతున్న వేళ, జగన్ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు.
ఏపీలో వర్షాలకు విజయవాడ, గుంటూరులో కొన్ని ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరిన మాట వాస్తవమే. అయితే ఆ నీటిని చూపించి అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అమరావతి విషయంలో తప్పుడు వార్తలు ప్రచారంలోకి తెస్తున్నారని, దీనివల్ల రాజధాని నిర్మాణంపై లేనిపోని అపోహలు వచ్చే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. గతంలో కూడా అమరావతిపై తప్పుడు ప్రచారం చేసి నిధులు రాకుండా అడ్డుకున్నారని, నిర్మాణ ప్రాజెక్ట్ లను ఆపేశారని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరింత విషప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.