Ayyappa Deeksha : కార్తీకమాసం మొదలు మకరసంక్రాంతి వరకూ ఎక్కడ చూసినా అయ్యప్పస్వామి శరణు ఘోష వినిపిస్తుంటుంది. ఎటు చూసినా అయ్యప్ప మాలధారులే కనిపిస్తారు. 41 రోజుల పాటు నియమనిష్టలతో మాలధారణ చేసి అయ్యప్ప దర్శనం కోసం వెళతారు. అయితే ఈ మాల ధారణ ఎవరెవరు చేయవచ్చు? ఎవరెవరు చేయకూడదు అనే విషయం మీద పలువురికి అనేక సందేహాలు ఉంటాయి.
మాలలో ఉన్నంత వరకు అత్యంత నియమ నిష్టలతో దీక్ష చేస్తారు. మండల దీక్ష పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటిస్తారు. నేలమీద పడుకోవడం, చన్నీటి స్నానం, పాదరక్షలు ధరించకపోవడం పాటిస్తారు. సాధారణంగా మాలధారణ చేయాలి అంటే ముందుగా అయ్యప్ప మీద నమ్మకం ఉండాలి. అసలు మాలధారణకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలు మాలధారణకు ముందే గురుస్వాముల నుంచి తెలుసుకోవాలి. మాలధారణ చేసి నియనిష్టలతో అయ్యప్పకు పూజ చేయగలం అనుకున్న తర్వాతే ఎవరైనా మాలధారణ చేయాలి.
మాలధారణ చేయడానికి తల్లిదండ్రుల ఆశీస్సులు, భార్య అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.. పురుషులు ఏ వయసు వారైనా మారధారణ చేయవచ్చు కానీ స్త్రీలు మాత్రం ఋతుచక్రం మొదలు కాకముందు, అది నిలిచిపోయిన తరువాత వారు మాత్రమే మాలధారణ చేయాలి. ఇక కొన్ని సందర్భాలలో మాలధారణ చేయకూడిని పరిస్థితులు కూడా పురుషులకు ఏర్పడతాయి. తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది కాలం వరకు మాల ధరించకూడదు. ఒకవేళ సవతి తల్లిదండ్రులు మరణిస్తే 6 నెలల వరకు మాల ధరించకూడదు. అదే భార్య మరణిస్తే 6 నెలల వరకు మాల ధరించకూడదు. ఒకవేళ సవతి భార్య మరణిస్తే 3 నెలల వరకు మాల ధరించకూడదు.
గురుస్వాములు ద్వారా సంపూర్ణముగా దీక్ష నియమాలు తెలుసుకుని దీక్ష చెయ్యడం ద్వారా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం త్యరగా పొందగలము. అందువల్ల గురువులు,పెద్దలు చెప్పినవి. మనం అందరం తెలుసుకుని పాటించాలి.
తప్పులు ఉంటే పెద్దలు గురువులు మన్నించి, సరిదిద్దగలరు. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు. మనస్సు మొత్తాన్ని ఒకే విషయంపై లగ్నం చేయడమే ఈ దీక్షలో పరమార్థం. రేపు మాల వేసుకుంటామని ఈ రోజు మద్యం, మాంసం తీసుకోవడం అస్సలు చేయకూడదు. మాలధారణకు కనీసం మూడు రోజుల ముందు నుంచీ పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః…