రాధాకృష్ణుల పేర్లు ఎంతగా ముడిపడిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కృష్ణుడిని జంటగా చూపించాలంటే పక్కన రాధా ఉండాల్సిందే. వీరిద్దరినీ ప్రేమ స్వరూపంగా భావిస్తారు. దైవిక ప్రేమికులుగా వీరికి ఎంతో పేరుంది. కానీ కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోలేదు. కేవలం వీరు ప్రేమికులుగానే మిగిలిపోయారు. చరిత్రలో విడిపోయిన ప్రేమికుల్లో తొలివారిగా వీరిద్దరినే చెప్పుకుంటారు. ఆ తర్వాత కృష్ణుడు పెళ్లిళ్లు చేసుకోవడం, పాండవులతో సహవాసం, కురుక్షేత్ర యుద్ధం, చివరికి మరణం ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? రాధ ఎవరు? కృష్ణుడిని ప్రేమించిన తర్వాత రాధ ఏమయింది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది? అనే విషయాలు. రాధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యమునా నదే సాక్షి
బృందావనంలోనే రాధాకృష్ణులు పెరిగారు. బృందావనంలో ఉండే వృషభానుడికి రాధ జన్మించింది. అక్కడే కృష్ణుడు, రాధా కలిసి తోటలలో ఎంతో సమయం గడిపేవారు. యమునా నది ఒడ్డున వారిద్దరి రాసలీలలు ఎప్పటికీ మరువరానివి. కృష్ణుడు మనస్ఫూర్తిగా రాధను ప్రేమించాడు. కానీ లోకోద్ధారణకు వచ్చిన కృష్ణుడు రాధవద్దే ఉండడం చాలా కష్టం. అందుకే కంసుడిని చంపేందుకు మధురకు బయలుదేరాడు. వెళ్లే ముందు కృష్ణుడు రాధను కలిశాడు.ఆమె కృష్ణుడికి తాను ఎప్పటికీ ఏడవనని మాట ఇచ్చింది. ఆమె ప్రేమకు బానిసైన కృష్ణుడు బృందావనంలో ఎప్పటికీ రాధని తలుచుకుంటూనే ఉంటారని వరమిచ్చాడు. అందుకే బృందావనంలోని ప్రజలు ఇప్పటికీ రాధే రాధే అని చెబుతూనే ఉంటారు. మీరు ఆ ఊరికి వెళ్లినప్పుడు అడ్డుతప్పుకోమని అడగడానికి కూడా ‘రాధే రాధే’ అంటారు. అంతగా రాధ పేరు ఇక్కడ వినిపిస్తుంది.
రాధా పెళ్లి ఇతనితోనే
కృష్ణుని ఎడబాటుతో రాధ పూర్తిగా కుంగిపోయింది. గోపికలతో ఆడలేకపోయింది. జుట్టును దువ్వలేదు. పువ్వులు ముడవ లేదు. జీవితం వ్యర్థం అనుకుంది. తల్లిదండ్రుల బలవంతంతో ఒక యాదవ వంశానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం కృష్ణుడి దగ్గరే ఉండిపోయింది. భర్తతో జీవిస్తున్నా కూడా ఆమె మనసులో పూర్తిగా నిండిపోయినది. కృష్ణుడే అందుకే ఇక కృష్ణుడు ఎడబాటును తాళలేక ద్వారక చేరుకుంది.
రాధ మరణం
రాధా ద్వారకకు వెళ్లిన తర్వాతే కృష్ణుడు రుక్మిణి, సత్యభామను వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. కానీ ఆమె ఎలాంటి బాధపడలేదు. కృష్ణుడికి రాధ గురించి తెలిసి ఆమెకు ఎదురొచ్చాడు. రాధా కృష్ణుడికి తాను దాసిగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అదే తన చివరి కోరికనే చెప్పింది. తన కోసం శ్రీకృష్ణుని వేణువు వాయించమంది. ఆ మధురమైన సంగీతం వింటూనే రాధా ఈ లోకాన్ని విడిచింది. తన శరీరాన్ని వదిలిన రాధా కృష్ణుడిలో కలిసిపోయింది. ఇదే రాధాకృష్ణుల ప్రేమ కథ. వీరి ప్రేమకు అంతులేదు. హిందూమతంలో ప్రేమ అనే పదం ఉన్నంతవరకు రాధాకృష్ణుల కథ వినపడుతూనే ఉంటుంది.