Kartika Masam : ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందుతారని కార్తీక పురాణాలు చెబుతున్నాయి.
కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనవి చెప్పాడు. పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం చేయకూడదు.
శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు.
కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు. కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి.
కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి.