E-Paper
Advertisement

Top 20 News: శంషాబాద్‌లో ఘోరం.. పిక్నిక్‌‌కి వెళ్తూ స్కూల్ బస్సు బోల్తా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ

Top 20 News: శంషాబాద్‌లో ఘోరం.. పిక్నిక్‌‌కి వెళ్తూ స్కూల్ బస్సు బోల్తా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ

1. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

2. మేడారం జాతర పనులు.. పరిశీలించిన మంత్రి సీతక్క

మేడారం జాతర పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చే భక్తులకోసం పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన ఆలయం చుట్టూ రాతి ప్రాకార నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మేడారం పరిసరాల్లో భక్తులు సేదతీరేలా భూములను చదును చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్ పై ఎస్పీ రామ్ నాథ్ తో కలిసి జంక్షన్లను పరిశీలించారు.

3. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు.. పటిష్ట బందోబస్తు

భద్రాచలంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు కేంద్ర భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న రామయ్యను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను కేంద్ర బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

4. శంషాబాద్‌లో ఘోరం.. పిక్నిక్‌‌కి వెళ్తూ స్కూల్ బస్సు బోల్తా

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్కూల్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ జలవిహార్‌కు విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

5. భక్తులపై పిచ్చి కుక్క దాడి.. ఏకంగా 25 మందిని

సిరిసిల్ల జిల్లా వేములవాడలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తోంది. వేములవాడ రాజన్న గుడికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఒక్క రోజే 25 మందిని పిచ్చికుక్క కరిసింది. దాడిలో గాయపడ్డ బాధితులు వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క స్వైరవిహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

6. మంచం పక్కన మంట.. వృద్ధురాలి మృతి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చలి కాగడానికి వేసుకున్న చలిమంట ఒంటరి వృద్ధురాలి ప్రాణాలు తీసింది. మంచం పక్కన పెట్టిన మంట దుప్పటికి అంటుకోవడంతో 80 ఏళ్ల నరసమ్మ సజీవ దహనం అయ్యింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

7. కారును ఓవర్ టేక్ చేయబోయి స్కూల్ బస్సు బోల్తా

మహబూబ్ నగర్ జిల్లా పెద్దపల్లిలోని NH 44పై స్కూల్ బస్సు బోల్తాపడింది. బాల్‌నగర్ మండలంలోని పెద్దపల్లి వద్ద ముందున్న కారును ఓవర్‌ టేక్ చేయబోయి బస్సు బోల్తా పడింది. నారాయణపేటలోని మరికల్‌కు చెందిన కాలేజీ స్టూడెంట్స్ స్కూల్‌ బస్సును రెంట్‌కు తీసుకొని హైదరాబాద్ జలవిహార్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులు 43 మంది విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

8. న్యాయం చేయాలంటున్న సర్పంచ్ అభ్యర్థి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కరివారిగూడెంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివాదం నెలకొంది. తమకు ఎక్కువ ఓట్లు వచ్చినా.. రిటర్నింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారని ఓటమిపాలైన అభ్యర్థి ఆంగోత్ ధనమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము కోరినా ఆర్ఓ రీకౌంటింగ్ నిర్వహించలేదని ఆరోపిస్తూ.. తనకు న్యాయం చేయాలని కోరారు.

9. వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలకు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 నుంచి 36 గంటల సమయం పడుతుంది. ఈ నెల 29 వరకు రద్దీ ఇలానే కొనసాగుతుందని టీటీడీ భావిస్తోంది. భద్రతా దృష్ట్యా తనిఖీలు చేసిన తర్వాతే కొండపైకి వాహనాలను పంపిస్తున్నారు. దీంతో అలిపిరి వద్ద కిలోమీటర్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

10. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ

ఏపీలో అతినీతికి అడ్డాగా మారిన సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ కొరడా జులిపిస్తోంది.సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్ పెట్టిన ఏసీబీ.. అక్రమార్కుల భరతం పట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ముఖ్యంగా లంచాల రుచి మరిగిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ల అక్రమ ఆస్తుల డొంక కదిలిస్తోంది.పలువురు ఆఫీసర్లపై కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.

11.క్రిస్మస్ సందడి

బాపట్ల జిల్లా చీరాల నియెజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని చర్చలన్నింటినీ విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 109 ఏళ్ల చరిత్ర కలిగిన చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చిలో అర్ధరాత్రి వేలాది మంది క్రైస్తవుల మధ్య క్యాండిల్ షో నిర్వహించారు.

12. పేకాట రాయుళ్లు అరెస్ట్

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. జగ్గంపేట మండలంలోని గ్రామాల్లో ఎవరైనా కోడిపందాలు, గుండాట, పేకాట, బొమ్మ బొరుసు వంటి జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఎక్కడైనా జూద క్రీడలు ఆడినట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఎస్సై సూచించారు.

13. ఏపీలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

ఏపీలో బైక్‌ దొంగల ముఠా గుట్టురట్టయింది. నిందితుల వద్ద నుంచి దాదాపు 3 లక్షల 70,000 విలువైన రెండు బుల్లెట్‌ బైక్‌లు, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు ఎడ్లపాడు పోలీసులు. ఎడ్లపాడు మండల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న పొలిశెట్టి మహేష్ బాబు, చిలక విగ్నేష్, పల్లపు ఆంజనేయులును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

14. అరుదైన సిలువ పీత

కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్ పరిధిలో అరుదైన సిలువ పీత మత్స్యకారుల వలకు చిక్కింది. సాధారణంగా వేల సంఖ్యలో పీతలు వేటకు లభించినా, అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఇలాంటి సిలువ పీతలు దొరుకుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పీతల డొప్పపై సహజంగా సిలువ ఆకారం కనిపించడంతో, మత్స్యకారులు వీటిని దైవసంబంధమైనవిగా భావిస్తూ మళ్లీ సముద్రంలోకి వదిలి వేస్తారని తెలిపారు. అలాగే, ఈ పీతను తినేందుకు ఎవరూ ఆసక్తి చూపరని, సంప్రదాయ విశ్వాసాల కారణంగా గౌరవంతో సముద్రానికి అప్పగిస్తామని మత్స్యకారులు తెలిపారు.

15. 10 కిలోల గంజాయి స్వాధీనం

అన్నమయ్య జిల్లా రాజంపేటలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి యువతకు విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లు, రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

16. తీవ్ర విమర్శలు

పాక్‌ ఫీల్డ్‌మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ కు జీవితకాల రక్షణ కల్పించడంపై జేయూఐ-ఎఫ్ స్కాలర్ ముఫ్తీ తాకీ ఉస్మాన్ తీవ్ర విమర్శలు చేశారు. న్యాయపరమైన జవాబుదారీతనం నుంచి ఆయనకు రక్షణ కల్పించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు.

17. క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ

దిల్లీలోని కెథెడ్రల్‌ చర్చ్‌ ఆఫ్‌ రిడెంప్షన్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొందరు క్రైస్తవులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. క్రీస్తు సందేశం బలమైన సమాజాన్ని నిర్మిస్తోందన్నారు. యేసుక్రీస్తు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పడంతో పాటు మానవుల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయన్నారు.

18. అందుకే నష్టం జరుగతుంది.

కొందరి గుత్తాధిపత్యానికి ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడంతో చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతోందని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా బ్యూరోక్రసీ సంకెళ్లతో వారిని బంధిస్తోందని, జీఎస్టీవంటి తప్పుడు విధానాలతో అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.

19. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌.. వైభవ్‌ సూర్యవంశీని సచిన్‌ తెందుల్కర్‌తో పోల్చారు. సూర్యవంశీకి టీమ్ఇండియాలో చోటివ్వాలని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. అలాగే వైభవ్‌కు టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకు అవకాశమివ్వాలని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కు సూచించాడు.

20. క్షమాపణ

దండోరా వేడుక నుంచి బయటకు రాగానే తాను పొరపాటుగా మాట్లాడినట్టు గ్రహించానని.. అందుకు తోటి నటులతోపాటు, ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానన్నారు నటుడు శివాజీ. తప్పుగా మాట్లాడానని అనిపించిన వెంటనే ఇంటికొచ్చి మొదట తన భార్యకు క్షమాపణలు చెప్పానన్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×