Arundhathi Nakshatram : పెళ్లి అనే మంగళకార్యముతో ఒక్కటవుతున్న కొత్త ఆలుమగలకు అన్యోన్యముగా ఎలా మెలగాలో చెప్పేందుకు ‘అరుంధతీ-వశిష్ఠుల’ బంధమును చూపించడం అనాధిగా తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయం. నూతన వధూవరులకి అరుంధతి నక్షత్రాన్ని చూపడం ఒక ఆనవాయితీగా మారింది. .అరుంధతీ నక్షత్రం చూడటం తెలుగు వారి పెళ్ళిళ్ళ లో చాలా ముఖ్యమైంది. ఏడడుగుల సప్తపది తరువాత చేసే ఆనవాయితీ. ఈ అరుంధతీ నక్షత్ర దర్శనం వల్ల వివాహ బంధం లో దాంపత్య అవగాహన, అనురాగం, విధేయత, సంతోషాలు పవిత్ర అరుంధతి-వశిష్ఠుల మాదిరి వెల్లివిరుస్తాయని నమ్మకం.
అరుంధతి, వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపిస్తారు బ్రాహ్మణులు. అలా చేస్తే సంసార జీవితం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతుంటారు. మాఘ మాసాది పంచ మాసాల్లో తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనిపించదు. రాత్రి చంద్రుడ్ని , నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటికి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాలం సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. సప్తర్తి మండలంలో పక్క పక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠుల వారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.
ఖగోళ శాస్త్రం ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని ఆల్కోర్ అంటారు. దీని జత గా ఉండే జంట తారనే వశిష్ఠ నక్షత్రం మిజార్ అంటారు. ఈ రెండు జంట తారల సమ్మేళనం ‘సప్తర్షి తారా మండలం’. ఇలాంటి జంట తారలు ఎన్నో ఖగోళం లో ఉండగా, ఈ జంట తారల వ్యవస్థ కే మన తెలుగు వారి పెళ్ళి సాంప్రదాయాలలో ఎందుకింత ప్రాముఖ్యతనిచ్చారన్న సందేహాలున్నాయి. మైజార్, అల్కర్ లను జంట నక్షత్రాలుగా ఆరు శతాబ్దాల క్రితం గుర్తించారు. అప్పటి నుంచి ఈ రెండూ కలిసి కట్టుగా ప్రయాణిస్తూనే ఉన్నాయ. భార్య, భర్తలు కూడా అలాగే కలిసిమెలిసి ఉండాలని చెపేందుకే మన పూర్వికులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తుంటారు.