Steve Jobs : యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌ల తయారీతో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా యాపిల్ ఎదిగింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పాత చెప్పులను ఇటీవల వేలం వేశారు. 2 లక్షల 18 వేల అమెరికన్ డాలర్లకు ఆ చెప్పులను ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. భారత్ కరెన్సీలో దాని విలువ కోటి 76 లక్షలు . అంచనా వేసిన దానికంటే ఎన్నో రెట్ల ఎక్కువ మొత్తానికి స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు అమ్ముడు పోయినట్లు వేలం వేసిన సంస్థ జూలియన్స్ వెల్లడించింది.
అమెరికాకు చెందిన జూలియన్స్ సంస్థ అనేక రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. అందులో స్టీవ్ జాబ్స్ వాడిన బిర్కెన్‌స్టాక్ ఆరొజోనా కంపెనీకి చెందిన లెదర్ చెప్పులను ఉంచింది. 1980 దశకంలో యాపిల్ కంప్యూటర్ రూపొందించే కీలక సమయాల్లో స్టీవ్‌జాబ్స్ ఆ చెప్పులు వాడారని ఆ సంస్థ తెలిపింది. ఆ చెప్పులను స్టివ్ జాబ్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల కాలి ముద్రలు స్పష్టంగా ఉన్నాయని వివరించింది. వేలంలో ఆ చెప్పులకు 60 వేల డాలర్లు వస్తాయని ఊహించింది. అయితే జూలియన్స్ సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో 2, 18 ,750 డాలర్లకు ఆ చెప్పులు అమ్ముడు పోయాయి. ఆ చెప్పులు కొన్న వ్యక్తి వివరాలు మాత్రం జూలియన్స్ సంస్థ వెల్లడించలేదు.
స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నియాక్ కలిసి కాలిఫోర్నియాలో 1976లో యాపిల్ సంస్థను స్థాపించారు. అనతికాలంలో యాపిల్ ప్రత్యేక బ్రాండుగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే దిగ్గజ కంప్యూటర్ సంస్థగా ఎదిగింది. క్లోమ గ్రంధి క్యాన్సర్‌తో బాధపడిన స్టివ్ జాబ్స్ 2011లో చనిపోయారు.