వర్షాకాలంలో చర్మ సమస్యలు అధికంగా వస్తాయి. అలాగే ముఖంపై ఉండే చర్మం పేలవంగా మారుతుంది. కాంతి విహీనంగా కనిపిస్తుంది. కాబట్టి వానాకాలంలో చర్మాన్ని మెరిసేలా చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాల్సిందే. ముఖ్యంగా తేనెను మీ చర్మ సంరక్షణకు ఉపయోగించాలి. ప్రతి ఇంట్లోనూ కూడా తేనే ఉంటుంది. వానాకాలంలో తేనెను ఉపయోగిస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
తేనె ఎందుకు?
యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం తేనె చిక్కటి, తీపి ద్రవం. ప్రధానంగా దీనిలో ఫ్రక్టోజు, గ్లూకోజు అనే సహజ చక్కెరలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఖనిజాలు, ఎంజైమ్‌లు, విటమిన్లు, ఇతర పోషకాలు కూడా నిండి ఉంటాయి. పురాతన కాలం నుంచి ప్రజలు చర్మ సంరక్షణకు తేనెను ఉపయోగిస్తున్నారు.
తేనెతో ఉపయోగాలు
తేనెలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వానాకాలంలో చర్మ సంరక్షణకు ఇది పరిపూర్ణంగా పనిచేస్తుంది. తేనెను ముఖానికి పూయడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. దీనివల్ల మొటిమలు, దురదలు వంటివి రాకుండా ఉంటాయి. ఇక దీనిలో ఉండే ఎంజైమ్‌లు హైడ్రోజన్ పెరాక్సైడ్ ని విడుదల చేస్తుంది. దీనివల్ల ముఖంపై ఉండే క్రిములు మరణించే అవకాశాలే ఎక్కువ.
వానాకాలంలో గాయాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో తడి తగిలే భాగాలలోనే ఇవి అధికంగా వస్తాయి. గాయం లేదా కాలిన చర్మంపై తేనెను పూస్తే అది త్వరగా నయమవుతుంది. వాపు కూడా తగ్గిపోతుంది. చుండ్రు, పిల్లలకు వచ్చే డైపర్ దద్దుర్లు, సొరియాసిస్, హేమరోయిడ్స్, చర్మం పగుళ్లు వంటి వాటి అన్నింటికీ తేనె అద్భుతంగా పనిచేస్తుంది.
ముడతలు తగ్గించి
సౌందర్య ఉత్పత్తుల్లో తేనె కూడా ముఖ్యమైనదే. చర్మాన్ని మృదువుగా చేసే శక్తి దీనికి ఉంటుంది. అలాగే ఇది మంచి హెయిర్ కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేయడంలో తేనెదే మొదటి స్థానం. ముఖంపై రాస్తే ముడతలు తగ్గిస్తుంది. చర్మం పిహెచ్ సమతుల్యతను కాపాడుతుంది. అలాగే వ్యాధుల బారిన పడకుండా అడ్డుకుంటుంది.
తేనె ఏ మొక్క లేదా పువ్వు నుండి తయారైందని దానిపై కూడా దాని పనితీరు ఆధారపడి ఉంటుంది. తేనెలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, సైటోకిన్లు, ప్రోటీన్లు నిండుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చర్మాన్ని కాపాడతాయి. గాయాలు నయం అయ్యేలా చేస్తాయి. వానాకాలంలో మీరు ముఖానికి ఏది రాయాల్సిన అవసరం లేదు. కేవలం తేనె రాయండి చాలు.
తేనెను అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా వినియోగించవచ్చు. ప్రతిరోజూ ఒక స్పూను తేనె తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.దగ్గు, గొంతునొప్పి వంటి వాటి నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. పేగుల ఆరోగ్యానికి కూడా తేనె ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుంది. గుండెకు కూడా తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఒక స్పూను తేనె తాగేందుకు ప్రయత్నించండి.