AP Politics: ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా నడుస్తున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రతిదానికి వీలైనంత ఎక్కువ ప్రచారం చేస్తూ అనుక్షణం ప్రజల నాలుకలపై ఉండడానికి ప్రయత్నిస్తుంటే ..మరోవైపు ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుడు ఎక్కడో ఉంటూ ప్రజలకు దూరమవుతున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. దానికి తగ్గట్టే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమయాల్లో ఏపీలో ఉండటం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడాయన చెల్లెలు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా అదే బాటలో ఉంటున్నారు. రాజకీయాల్లో ఇది సరైన స్ట్రాటజీ కాదని నిపుణులు అంటున్నారు.
ఓటమి తర్వాత ఎక్కువ టైమ్ బెంగళూరులోనే గడుపుతున్న జగన్
2019 ఎన్నికలకు ముందు తాను ” అమరావతిలోనే సొంత ఇల్లు కట్టుకున్నానని చంద్రబాబు ఆ సాహసం చేయడం లేదని” పదేపదే చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి 2024లో పార్టీ ఓడిపోయాక వీలైనంత ఎక్కువ సమయం బెంగుళూరు లోనే ఉంటుండటంపై వైసీపీ నేతల్లోనే అసహనం వ్యక్తం అవుతోంది. వైసీపీ నేతలు ముఖ్యమైన విషయాలు జగన్‌తో చర్చించాల్సిన అవసరం వచ్చినా ఆయన అందుబాటులో ఉండటం లేదు. లేక రాష్ట్రంలో ఏదైనా అవాంతరం వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన సమయాల్లో బెంగళూరులో ఉన్న జగన్ తాడేపల్లికి వచ్చేవరకు వాళ్లు వెయిట్ చేయాల్సి వస్తోంది. నిన్న మొన్నటి తుఫాన్ సమయంలో కూడా అయన బెంగళూరులోనే ఉన్నారు. విజయవాడకు రావాల్సి ఉన్నా విమానాలు క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు . దీన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దీనివల్ల జగన్ రెడ్డి ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడం విమర్శల పాలవుతోంది.
నివాసం విషయంలో అన్న బాటలోనే పయనిస్తున్న షర్మిల
రాజకీయంగా అన్నతో విభేధించి సొంత దారిలో వెళుతున్న షర్మిల నివాసం విషయంలో మాత్రం అన్న బాటలోనే వెళుతోందన్న అభిప్రాయం జనాల్లో ఉంది. నిజానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెపై సొంత పార్టీ నుంచే చాలా విమర్శలు వస్తున్నాయి. పార్టీలో అసమ్మతిని సానుకూలం చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఉంది. తుఫాను లాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రజలకు నేతలకు అందుబాటులో ఉండటం సహజం. దాంతో క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు ఒక భరోసా ఉండడంతో పాటు సమన్వయంతో పని చేసే అవకాశం ఉంటుంది.
విజయవాడలో షర్మిల ఇల్లు కొన్నారని ప్రచారం..
కానీ షర్మిల వీలైనంత ఎక్కువగా హైదరాబాదులో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవాడ సమీపంలో ఇల్లు కొన్నారన్న ప్రచారం జరిగినా ఆమె ఇంతవరకు అక్కడకు వెళ్ళింది లేదు. మరోవైపు ఆమె కుటుంబ వ్యవహారాల రీత్యా ఎక్కువగా విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళుతున్నారు. మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీపీ పీఠం లాంటి కీలక బాధ్యతలు ఎత్తుకున్న షర్మిల తాను ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎందుకో మరి ఆమె ఇక్కడ నివాసం ఉండడం లేదు. ఇది రాజకీయంగా చాలా రాంగ్ స్టేటస్ అని విశ్లేషకులు చెప్తున్నారు.
సత్వర చర్యలు చేపడుతూ ప్రచారం చేసుకుంటున్న కూటమి
ఇక ఇలాంటి విషయాల్లో కూటమి చాలా వేగంగా దూసుకు పోతోంది. అది తుఫాన్ అయినా వరదైనా వెన్వంటనే సహయ చర్యలు చేపడుతూ.. వాటి ప్రచారంలో మాత్రం ఏ లోటూ రానీయడం లేదు. కొన్నిసార్లు ఈ ప్రచారం హద్దు దాటిందని, అతి చేస్తున్నారని ట్రోల్స్ వస్తున్నా అనుక్షణం ప్రజల దృష్టిలో ఉండడానికి కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ప్రచారం తో పోటీ పడడం మాట ఎలా ఉన్నా ముందు సొంత పార్టీ నేతలకు అందుబాటులో ఉండడానికి జగన్, షర్మిల లాంటి నేతలు స్థానికంగా ఎక్కువగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు.
కమ్యూనిస్టు నేతలు కూడా ఇప్పటికీ వరద ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన పరిస్థితులు లేవు. దివంకత ముఖ్యమంత్రి పిల్లలు, రెండు వేరు వేరు పార్టీలకు అధ్యక్షులు అయి ఉండీ ఇలాంటి విషయాల్లో వెనుక పడడం రాంగ్ స్ట్రాటజీ అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్న మాట వాస్తవం. మరి ఇప్పటికైనా జగన్, షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.
Story By Apparao, Bigtv