క్యారెట్ తో వండిన వంటకాలన్నీ ఆరోగ్యానికి మంచివే. ఎందుకంటే క్యారెట్ లో బీటా కెరాటిన్ ఉంటుంది. క్యారెట్ తో ఇక్కడ మంచూరియా ఎలా చేయాలో చెప్పాము. దీన్ని వండడం చాలా సులువు. పైగా క్యారెట్ వల్ల ఆరోగ్యమే కాబట్టి ఇంటిల్లపాది హాయిగా తినవచ్చు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
క్యారెట్ మంచూరియా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు – పావు కిలో
వాము – చిటికెడు
టమోటా సాస్ – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నూనె – తగినంత
సోయా సాస్ – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర స్పూను
కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను
శెనగపిండి – రెండు కప్పులు
కారం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
క్యారెట్ మంచూరియా రెసిపీ
1. క్యారెట్ ను ముద్దలాగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో తురిమిన క్యారెట్ ను వేయాలి. అందులోనే కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వాము, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసుకోవాలి.
4. ఇప్పుడు క్యారెట్ మిశ్రమాన్ని తీసి చేత్తోనే చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి.
5. ఇప్పుడు ఆ లడ్డూలను నూనెలో వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.
7. అందులో నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా సాస్, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
8. కార్న్ ఫ్లోర్ లో కొంచెం నీరు వేసి కలిపి ఇందులో వేయాలి. ఇది గ్రేవీ లాగా అవుతుంది.
9. అప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ ను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
10. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ క్యారెట్ మంచూరియా రెడీ అయినట్టే.
క్యారెట్ మంచూరియా చాలా రుచిగా ఉంటుంది. పైగా క్యారెట్ తో చేసాం.. గనుక ఇంకా ఎంతో ఆరోగ్యం. ఇంట్లో పిల్లలకు అప్పుడప్పుడు ఇలా క్యారెట్ మంచూరియా చేసి ఇవ్వండి. బయట దొరికే వెజ్ మంచూరియాలకన్నా ఇలా ఇంట్లోనే క్యారెట్ మంచూరియా చేసి పెట్టడం ఉత్తమం.