CM Chandrababu: భేదాల కేంద్రం, వివాదాలకు చిరునామా … అనగానే ఏపీ ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చే నియోజవర్గం కృష్ణాజిల్లాలోని తిరువూరు.. ఎంతో కాలంగా ఆ నియోజకవర్గం టీడీపీలో కొనసాగుతున్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కినిపించడం లేదంటున్నారు. దాంతో టీడీపీ అధిష్టానం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ లైన్ దాటితే తీవ్ర చర్యలకు తీసుకునే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ తిరువూరు వ్యవహారాన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు?
టీడీపీ నేతల మధ్య కరువవుతున్న క్రమశిక్షణ
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ , టీడీపీలో కట్టుబాట్లు ఎక్కువ అని నేతలు చెబుతూ ఉంటారు.. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది .. గతంలో టీడీపీ నేతలు కొంత క్రమశిక్షణతోనే ఉన్న పరిస్థితి.. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు రోడ్డెక్కి సిగపట్లకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్కోవడం, పాలనా పరంగా, రాజకీయంగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారు.
పరస్పర విమర్శలు చేసుకుంటున్న కొలికపూడి, కేశినేని
ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎంపీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్నారు కొలికలపూడి.. పదవులు అమ్ముకుంటున్నారు అని ఆరోపించారు. దీనిపై ఎంపీ కూడా ఘాటుగా స్పందించారు. తను నికార్సైన టీడీపీ కార్యకర్తను అంటున్నారు కేశినేని చిన్ని.. తనపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే రాజ్ శేఖర్‌రెడ్డిల మధ్య గొడవలు
నియోజవర్గ పరిధిలో గిరిజన మహిళ వివాదంతో మొదలైన ఘటన వీరి మధ్య వివాదానికి కారణం అయింది. టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా రచ్చ స్టార్ట్ అయింది. ఇంకా రాష్ట్రంలోని కొన్ని సెగ్మెంట్లలో ఎంపీ, ఎమ్మెల్యే ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే రాజ్ శేఖర్ రెడ్డిల గొడవులు రచ్చకెక్కుతున్నాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్ట్ గా కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నేతలపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు అందుబాటులో లేక వాయిదా పడిన భేటీ
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా కూడా నేతలు ఇదే తరహా వైఖరి కొనసాగించడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ లైన్ దాటి పోవద్దు అని చెప్తున్నా కూడా ఇదే లైన్ లో నేతలు ఉన్నారు. దీంతో టీడీపీ అధిష్టానం పెద్దలు తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నేతలను మొన్నా మధ్య పార్టీ కార్యాలయానికి రమ్మని పిలిచారు. అయితే సీఎం చంద్రబాబు లేకపోవడంతో ఆ భేటీ వాయిదా పడింది. మళ్లీ వారిని ఎప్పుడు పిలుస్తారన్నది తెలియడం లేదు.
అనుచరులతో ఆరోపణలు చేయిస్తున్న కొలికపూడి
పార్టీ పెద్దలు హెచ్చరికలు జారీ చేసినా ఇద్దరు నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు. అధిష్టానం పార్టీ కార్యాలయాన్ని పిలిచి పంపిన రోజు నుంచి తిరువూరు వివాదం మరింత రాజుకుటుంటుంది. ఎంపి నాని గురించి తన అనుచరుల ద్వారా వరుసగా మూడు నాలుగు రోజులు మీడియా సమావేశాలు పెట్టించి మరీ కొలికపూడి ఆరోపణలు చేయించారు. ఒక దశలో సీఎం తుఫానుపై సమీక్ష చేస్తుంటే సీఎంను కలవడానికి కొలికపూడి వెళ్లారు. అయితే తిరువూరు ఎమ్మెల్యేకి సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఎంపీ వర్గం ప్రచారం చేసింది. వచ్చే నెల రెండున ఎంపీ మరోసారి తిరువూరు నియోజకవర్గంలో పర్యటన చేయనున్న నేపధ్యంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.
తిరువూరును వదిలే పరిస్థితి లేదంటున్న కొలికపూడి
మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ చంద్రబాబు తనను మెచ్చుకున్నారని… నియోజవర్గం అభివృద్ధి జరుగుతుందని.. తన నియోజకవర్గంలో అవినీతి లేదని సీఎం చంద్రబాబు చెప్పారని.. అటువంటి సమయంలో తాను ఎంత దూరమైనా పోరాడుతానంటున్నారు. తిరువూరు పెట్టే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కార్యకర్తలకు, నేతలకి చెబుతున్నారు. ఎంపీ వర్గం కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తోందని.. తిరువూరు ఏమి పార్క్ కాదు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు రావడానికి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: జగన్, షర్మిల.. అవుట్ ఆఫ్ కవరేజ్..!
సుఖవాసి శ్రీనివాస్ కారణంగానే విభేదాలంటున్న నేతలు
మొత్తానికి టీడీపీ అధిష్ఠానం తిరువూరు వివాదంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఎవరిపై చర్యలు ఉంటాయి అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉందంటున్నారు. అయితే నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న సుఖవాసి శ్రీనివాస్ కారణంగానే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ప్రభలుతున్నాయని అంటున్నారు నియోజకవర్గ పార్టీ నేతలు. ఆ నేత నియోజకవర్గంలో వచ్చే ఆదాయంలో ఎమ్మెల్యే వర్గం వాటాని మింగేశారని అదే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆగ్గి రాజేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Story By Apparao, Bigtv